వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం : విశాల్ | Sakshi
Sakshi News home page

వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం : విశాల్

Published Mon, Oct 26 2015 4:32 PM

వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం : విశాల్

తమిళసినిమా : ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ ఉద్ఘాటించారు. ఈనెల 18న ఈ సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శరత్‌కుమార్ జట్టుతో పోటీపడ్డ విశాల్ జట్టు విజయం సాధించిన సంగతి విదితమే. సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఉదయం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో పత్రికల వారికి ధన్యవాద సమావేశం ఏర్పాటు చేశారు. తమిళ నిర్మాతల మండలి, తమిళ దర్శకుల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య, సినీ పీఆర్‌ఓల సంఘం, సినీ పత్రికా విలేకరుల సంఘం, సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సంఘం నిర్వాహకులు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌సంఘం) నూతర కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నటుడు మోహన్‌బాబు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తన అనుచరునితో పూలగుచ్ఛం పంపి అభినందనలు తెలిపారు.

మంచి చెయ్యాలన్న లక్ష్యంతోనే..
 సంఘం అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపునకు తోడ్పడిన వారందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఎన్నికలకు ముందు సంఘటనలను మరచి సంఘ సభ్యుల పరిరక్షణ కోసం సంఘటితంగా కృషి చేస్తామని అన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రధానంగా సంఘం భవన నిర్మాణం గురించి త్వరలోనే సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణానికి సంబంధించిన ఒప్పంద రద్దు విషయాన్ని శరత్‌కుమార్ విలేకరుల సమావేశంలో ప్రకటించారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ చేతికి అందగానే తదుపరి చర్యలపై చర్చిస్తామని చెప్పారు.

సంఘం ట్రస్టీగా కమలహాసన్..
ముఖ్యమైన విషయం ఏమిటంటే దక్షిణ భారత నటీనటుల సంఘం ట్రస్టీగా వ్యవహరించడానికి నటుడు కమలహాసన్ అంగీకరించారని విశాల్ తెలిపారు. సంఘ సభ్యులకు సేవా కార్యక్రమాల గురించిన ముఖ్య విషయాలను వేల్స్ విశ్వవిద్యాలయం చాన్సలర్  ఐజనీ గణేశ్ వెల్లడిస్తారని అన్నారు.

బాధ్యతలను పంచుకున్నాం
సంఘం కోశాధికారిగా బాధ్యతలు చేపట్టిన నటుడు కార్తీ మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఈ విషయంలో బాధ్యతలను పంచుకున్నామని చెప్పారు. ముందుగా రంగస్థల నటుల వివరాలను సేకరించే పనిలో భాగంగా రాష్ట్రంలోని ఊరూరా తిరిగి వారి స్థితిగతులను తెలుసుకుని ఆర్థిక సాయం, వైద్య సేవలు, పిల్లలకు విద్యాసాయం తదితర అంశాల గురించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యక్షుల్లో ఒకరయిన పొన్‌వన్నన్ మాట్లాడుతూ తాము చేసిన 41 వాగ్దానాల్లో ఇప్పటికే ఐదు నెరవేర్చామని, మిగిలినవీ అమలు పరుస్తామని అన్నారు.

వేల్స్ విశ్వవిద్యాలయం చాన్సలర్ ఐజనీ గణేశ్ మాట్లాడుతూ తన తండ్రి పేరుతో నెలకొల్పిన ఐజరీ వేల్స్ ట్రస్ట్ ద్వారా ఇంతకు ముందు 100 మంది నాటక కళాకారులకు ప్రతినెలా 500 రూపాయల చొప్పున సాయం అందించానని, ఇకపై ఆ మెత్తాన్ని వెయ్యికి పెంచుతున్నానని వెల్లడించారు. 105 మంది నాటకరంగ కళాకారుల పిల్లలకు ఉచ్చిత విద్య అందించనున్నట్లు హామీ ఇచ్చారు. సంఘం భవన నిర్మాణానికి తనవంతు సాయం ఉంటుందన్నారు. దీనిపై అక్కడికి హాజరైన సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement