‘యాత్ర’ ఈవెంట్‌లో కదిలించిన కథలెన్నో! | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 2 2019 4:30 PM

Yatra Assistant Director Ravi Emotional Speech In Pre Release Event - Sakshi

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర ఘట్టాన్ని వెండితెరపై యాత్రగా ఆవిష్కరించబోతోన్న సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటించగా.. ఇప్పటికే రిలీజ్‌చేసిన పాటలు, పోస్టర్స్‌, టీజర్‌లు చిత్రంపై భారీ అంచనాలను ఏర్పరిచాయి. శుక్రవారం జరిగిన యాత్ర చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. రాజన్న ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల ద్వారా లబ్ధిపొందిన అభిమానులు వేదికపై.. రాజన్నను తలుచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. 

‘యాత్ర’ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి మాట్లాడుతూ.. ‘2008లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా అమ్మకి గుండె నొప్పి వస్తే హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చాం. హార్ట్‌లో హోల్ ఉంది 6 నెలల కంటే ఎక్కువ బతకదని చెప్పారు. అంత స్థోమత లేదని తిరిగి మా ఊరు బస్సులో వెళ్తుంటే.. ఏ తల్లీ కొడుకుని కోరని ఒక కోరిక మా అమ్మ నన్ను అడిగింది. ‘మూడు లక్షలు అప్పు తెచ్చి నాకు ఆపరేషన్ చేయించు. నాకొక ఐదారేళ్లు బతకాలని ఉంది. మీరు చిన్న పిల్లలు’ అంది. అప్పుడు నా చదువు పోతే పోయింది మా అమ్మకంటే ఎక్కువ కాదు అని.. డిగ్రీ వదిలేసి హైదరాబాద్ వచ్చాను. జూబ్లీహిల్స్‌లోని ఓ కాఫీ షాప్‌లో పని చేస్తూ ఎంగిలి ప్లేట్లు, కప్పులు కడిగాను. అయినా నాలుగు నెలల్లో నాకు వచ్చింది రూ.20 వేలు మాత్రమే. ఆ డబ్బు మా అమ్మ హాస్పిటల్ ఖర్చులకు, బస్ చార్జీలకు సరిపోయింది. అప్పుడు మా అమ్మ.. ‘నా ప్రాణం పోతే.. చెల్లిని బాగా చూసుకో.. చెల్లి చిన్నది. నేను చనిపోయినా మీరు ధైర్యంగా ఉండాలి’ అని చెప్పింది. గుడి, చర్చి, మసీదు ఏది కనిపించినా మా అమ్మ ‘ఐదారేళ్లు బతికితే చాలు. నా పిల్లలు చిన్నవాళ్లు’ అని మొక్కుకునేది.

కానీ ఏ దేవుడూ మా మొర ఆలకించలేదు. కానీ 2009లో వైఎస్సార్ అనే దేవుడు నేనున్నాను.. అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. ఎల్‌బీ నగర్ కామినేని హాస్పిటల్‌లో ఒక్క రూపాయి తీసుకోకుండా ఆపరేషన్ చేశారు. మేము చాలా పేదవాళ్లం. చిన్న రెండు గదుల ఇల్లుంది. అది కూడా రాజశేఖర్ రెడ్డిగారిచ్చిన ఇందిరమ్మ ఇల్లే. మా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలుండవు. వైఎస్సార్ ఫోటోలు మూడు కనిపిస్తాయి. ప్రతిరోజు మా అమ్మ నాకు ఫోన్ చేస్తది. పదేళ్లకు ముందు ఆగిపోవాల్సిన మాట ఇప్పటికీ నాకు వినబడుతుందంటే దానికి కారణం వైఎస్సార్. ఈ మాట చెప్పటానికి మా అమ్మను ఇక్కడికి తీసుకొద్దామనుకున్నా. కానీ నేను సినిమాల్లో చేస్తున్నట్టు ఆమెకు తెలియదు. కానీ ఫిబ్రవరి 8న(‘యాత్ర’ రిలీజ్) మా స్వగ్రామం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి వెళ్లి.. మా అమ్మను, చెల్లిని సినిమాకు తీసుకెళ్లి గర్వంగా పెద్దాయన సినిమాకు పనిచేశానని చెప్పుకుంటా. నాకు తెలిసి ఇంతటి అదృష్టం రాదు. దేవుడు లాంటి మనిషి(వైఎస్సార్) చనిపోయారు. అలాంటి దేవుడి రుణం ఈ సినిమాకు పని చేయడం ద్వారా కొంచెమైనా రుణం తీర్చుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. చాలా మంది విద్యార్థులు, నిరుపేదలు తమ కథనాలతో ఎంతో మంది గుండెల్ని కదలించారు.

Advertisement
Advertisement