పాటకు కులం.. మతం లేదు | Sakshi
Sakshi News home page

పాటకు కులం.. మతం లేదు

Published Fri, Jan 27 2017 8:50 AM

పాటకు కులం..  మతం లేదు - Sakshi

► పద్మ విభూషణ్‌ కె.జె ఏసుదాస్‌

ఏసుదాస్‌ హిట్స్‌ – తెలుగు
1. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన (మేఘసందేశం)
2. గాలివానలో వాన నీటిలో (స్వయంవరం)
3. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి (అంతులేని కథ)
4. చిన్ని చిన్ని కన్నయ్యా (భద్రకాళి)
5. సాయీ శరణం బాబా శరణం (శ్రీ షిర్డీ సాయిబాబా)


హిందీ
1. ఆజ్‌ సే పహెలే (చిత్‌చోర్‌)
2. కా కరూ సజ్‌నీ (స్వామి)
3. కోయి గాతా మై సోజాతా (ఆలాప్‌)
4. దిల్‌ కే టుక్‌డే టుక్‌డే కర్‌కే (దాదా)
5. కహా సే ఆయె బదరా (చష్మే బద్దూర్‌)



భక్తి... కరుణ... ప్రేమ... సంతోషం... విషాదం...ఏసుదాస్‌ ఏ పాట పాడినా శ్రోతల మనసుల్లో చెరగని ముద్ర పడిపోతుంది. ఏ భాషలో పాడితే అది ఆయన మాతృభాష ఏమో అన్న భావన కలుగుతుంది. 50 ఏళ్లకు పైగా శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్న ఈ గాన గంధర్వుడి స్వరం ‘ఎవర్‌ గ్రీన్‌’. ‘పద్మ విభూషణ్‌’ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా  కె.జె. ఏసుదాస్‌తో స్పెషల్‌ ఇంటర్వ్యూ...

కంగ్రాట్స్‌ సార్‌... బుధవారం ఇంటర్వ్యూ ఇవ్వలేనంత బిజీ. గురువారం ఇస్తా అన్నారు. ఆలస్యమైనా ‘సాక్షి’తో మీరు ప్రత్యేకంగా మాట్లాడటం హ్యాపీగా ఉంది..

థ్యాంక్స్‌. ప్రశంసలు ఏ వ్యక్తికైనా ఉత్సాహాన్నిస్తాయి. నాకు ఉత్సాహా నివ్వడంతో పాటు నా గురువులను గుర్తు చేసాయి. నా తొలి గురువు మా నాన్న అగస్టీన్‌ జోసెఫ్‌. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎందరో గురువులు. కేఆర్‌ కుమారస్వామి అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, చెంబయ్‌ వైద్యనాథ భాగవతార్‌.. ఇలా ఎంతోమంది. వాళ్లు సాధించిన వాటి కంటే నేనేం ఎక్కువ సాధించలేదు. నా గొప్పతనం ఏమీ లేదు. నేనేం సాధించినా అదంతా నా గురువుల ఆశీర్వాద బలమే. మంగళంపల్లి బాలమురళీకృష్ణ సార్‌ దగ్గర నేను చదువుకోలేదు. కానీ, ఆయన్ను గురువులానే భావిస్తాను. ఆయన ప్రభావం కూడా నా మీద ఉంది. ఇంకా నేను చాలామంది గురువులకు ఏకలవ్య శిష్యుణ్ణి.

గురువుల ఆశీస్సులే కారణం... నేను సాధించిందేమీ లేదనడం మీ గొప్పతనం. ఇవాళ మీరు దేశం గర్వించదగ్గ గాయకుడు కావడానికి మీ కృషి చాలానే ఉంది..
అది మా అమ్మానాన్న చేసిన తపస్సు అంటాను. వాళ్లు చేసిన పుణ్యమే నాకు వరం అయింది, నాకు సంగీత జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ పుణ్యఫలమే నన్నింతటివాణ్ణి చేసింది. అమ్మానాన్నలు పిల్లలకు ఎంతో చేస్తారు. వాళ్లకు పిల్లలు ఎంత చేసినా తక్కువే. ఈరోజు మా అమ్మానాన్న నాతో లేరు. అందనంత దూరంలో ఉన్నా వాళ్ల ఆశీర్వాదాలు నాకెప్పుడూ దగ్గరగానే ఉంటాయి.

ఈ సందర్భంగా మీ అమ్మానాన్నల గురించి మీరు ఎప్పటికీ మరచిపోలేని విషయం ఏదైనా చెబుతారా?
ఒక్క విషయం కాదు. చాలా ఉన్నాయి. అయితే గాయకుడిగా నేనీ స్థాయికి రావడానికి కారణమైన ఓ విషయం చెబుతాను. నా మొదటి గురువు మా నాన్నగారని చెప్పాను కదా. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించకపోతే ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఉదయం ప్రార్థన చేస్తున్నప్పుడు పొరపాటున ఏదైనా పదాన్ని సరిగ్గా పలకపోతే సరిగ్గా పలికేవరకూ ఒప్పుకునేవారు కాదు. ‘మిగతా పనులు చేసుకోవాలి కదా.. త్వరగా ప్రార్థన ముగించండి’ అని అమ్మ అన్నప్పటికీ, నాన్నగారు పట్టించుకునేవారు కాదు. కరెక్ట్‌గా చెప్పాకే వదిలేవారు. ఆ రోజు ఆయన అలా చేయడం తర్వాత తర్వాత నాకు చాలా హెల్ప్‌ అయింది.

‘మా పాపాలు తొలగించు...’ అనే సాయిబాబా పాట, ‘హరివరాసనమ్‌ స్వామి విశ్వమోహనం..’ అనే అయ్యప్ప పాట మీ గొంతు నుంచి వచ్చినవే. పాటకు కులం లేదని పాడే తీరులో చెప్పేశారు...
అవును.. పాటకు కులం లేదు.. మతం లేదు. అసలు కుల మతాలే లేవు. భగవద్గీత, ఖురాన్, బైబిల్‌.. ఇలా పెద్ద పెద్ద గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే.. దేవుణ్ణి ఎవరూ తయారు చేయలేదు. ‘దేవుడు ఒక్కడే’ అని చెప్పాయి. కానీ, ఆ దేవుడు తయారు చేసిన మనం మాత్రం మన సౌకర్యం కోసం ప్యాంటూ, షర్టూ వేసుకున్నట్లు కులం, మతం అని పెట్టుకున్నాం. మనంతట మనం పెట్టుకున్న నియమాల కోసం గొడవలు పడుతున్నాం. రాజకీయం చేసుకుంటున్నాం. ‘దేవుడు ఒక్కడే’ అని మహా గ్రంథాలు చెబుతున్నప్పుడు ‘నీ దేవుడు.. నా దేవుడు’ అని విభజించాం. ఈ విభజన సంతోషాన్నిస్తుందా? మనశ్శాంతిగా ఉండగులుగుతున్నామా? అని ప్రశ్నించుకోవాలి.

ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా కులం కోసమో, మతం కోసమో, పదవుల కోసమో.. ఇలా అన్నీ గొడవలే.. 77 ఏళ్లుగా ప్రపంచాన్ని చూస్తున్న వ్యక్తిగా వీటి గురించి మీరేమంటారు?
మానవ జన్మ అదృష్టం అంటారు. దాన్ని వరంగా మార్చుకోవడం, శాపంగా మార్చుకోవడం... ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. పోరాడతాం.. పోరాడతాం.. పోరాడతాం... ఎంత కాలం పోరాడతాం? ఈ భూమ్మీదకు వచ్చినవాళ్లు వెళ్లక తప్పదు. అందుకే వీలైనంత సంతోషంగా బతకాలి. శాంతంగా ఉండాలంటాను.

గాయకుడిగా ఓసారి మీ తొలి రోజుల్లోకి వెళితే ఒకే రోజున నాలుగు సౌత్‌ మూవీస్‌కి పదకొండు పాటలు పాడారట.. ఎలా సాధ్యమైంది?
ఇప్పుడున్న సౌకర్యాలకు 30 పాటలు కూడా పాడేయొచ్చు. అప్పట్లో ఒకే రోజు పదకొండు పాటలంటే చిన్న విషయం కాదు. గుర్తు చేసుకుంటే ఆనందంగా ఉంది. మీకో విషయం చెప్పాలి. ఆ రోజున పన్నెండో పాట కూడా పాడేంత టైమ్‌ ఉంది. కానీ ఒకే రోజున 12 పాటలు పాడితే దిష్టి తగులుతుందని భయపడ్డాను. అందుకే ఆ ఒక్క పాట వదిలేశాను (నవ్వుతూ).

భక్తి పాటలు అద్భుతంగా పాడిన మీరు ‘ముద్దుతో ఓనమాలు దిద్దించనా..’ అంటూ రొమాంటిక్‌ సాంగ్, ‘ఆకాశ దేశాన.. ఆషాఢ మాసాన..’ అంటూ విరహ గీతమూ పాడారు.. ఇలాంటి పాటలు పాడినప్పుడు మీకెలా అనిపించేది?
మీరు పాట రసం గురించి మాట్లాడుతున్నారు. భక్తి రసం, ప్రేమ రసం, దుఃఖ రసం.. ఇలా అన్ని రసాలకూ ఓ గాయకుడిగా ఊపిరి పోయడం నా బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించానే తప్ప నేను గొప్ప అనుకోవడంలేదు. ఏ ట్యూన్‌ అయినా కంపోజర్‌కి బిడ్డలాంటిది. గాయకుడికి కూడా పాట అలాంటిదే. పాట పాడే ముందు ఆ పాట మూడ్‌ని దృష్టిలో పెట్టుకుని పాడతాను.

భారతీయ భాషలన్నింటిలోనూ పాడారు కదా... మీ మాతృభాష మలయాళం తర్వాత మీకు సులువుగా ఉన్న భాష ఏదనిపించింది?
కళాకారులకు భాషాభేధం లేదు. ఇది నేను కొత్తగా చెబుతున్నది కాదు. రికార్డింగ్‌కి వెళ్లే ముందు ‘పాట పాడటానికి వెళుతున్నాం’ అనుకుంటాను కానీ భాష గురించి ఆలోచించను. నేను భాష..  ఆ భాష తాలూకు పదాలకన్నా ‘అక్షరాల’ను నమ్ముతాను. పదాలను నమ్మను. కృష్ణుడు ముందు అక్షరం ‘క’తోనే మొదలవుతుంది. క్రీస్తులో కూడా ‘క’ అక్షరం ఉంది. కృష్ణుడులో ‘క్రి’ ఉంది.. క్రీస్తులోనూ ‘క్రి’ ఉంది. పదాలు చెప్పినప్పుడు భాష ఏంటో కనుక్కోగలుగుతాం కానీ అక్షరాలతో భాషను కనుక్కోవడం సాధ్యమా? ఉదాహరణకు, ‘ఆ’, ‘క’ అనే అక్షరాలు చెప్పి, ఇవి ఏ భాష అనడిగితే చెప్పగలుగుతామా? అన్ని భాషల్లోనూ అవి ఉన్నాయి కదా. అందుకే నేను అక్షరాలను మాత్రమే నమ్ముతాను.

సూపర్‌ సార్‌. ఫైనల్లీ ‘పద్మవిభూషణ్‌’ ఏసుదాస్‌... గాయకుడిగా ఇంకా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా?
ఈ ప్రపంచంలో దేనికైనా అంతం ఉంటుందేమో కానీ, ‘లెర్నింగ్‌’కి ఉండదు. ఇంకా చాలా నేర్చుకోవాలి.

Advertisement
Advertisement