'ఉడ్తా పంజాబ్' లీక్.. లీకు వీరులు సెన్సార్ బోర్డేనా? | Sakshi
Sakshi News home page

'ఉడ్తా పంజాబ్' లీక్.. లీకు వీరులు సెన్సార్ బోర్డేనా?

Published Wed, Jun 15 2016 8:14 PM

'ఉడ్తా పంజాబ్' లీక్.. లీకు వీరులు సెన్సార్ బోర్డేనా?

ముంబై
పోయి పోయి సెన్సార్ బోర్డుతో పెట్టుకుంటే మాటలా మరి... వాళ్లు ఏమైనా చేయగలరు. చివరకు విడుదల కాక ముందే సినిమాను టోరెంట్లలో లీక్ కూడా చేయగలరు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. చివరకు కోర్టు ద్వారా విడుదలకు గ్రీన్ సిగ్నల్ తెప్పించుకున్న 'ఉడ్తా పంజాబ్' చిత్ర యూనిట్ ఇప్పుడు తల పట్టుకుంటోంది. ఏయే టోరెంట్లలో తమ సినిమా లింకులు ఉన్నాయో వెతుక్కుని మరీ డిలీట్ చేయిస్తోంది. విషయం ఏమిటంటే... పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న డ్రగ్ కల్చర్ మీద తీసిన సంచలనాత్మక చిత్రం 'ఉడ్తా పంజాబ్' విడుదలకు ముందే టోరెంట్లలో లీకైంది.

 

అయితే.. లీకు చేసింది సాక్షాత్తు సీబీఎఫ్‌సీకి సంబంధించిన వాళ్లేనని అంటున్నారు. ఎందుకంటే, లీకైన సినిమా ప్రింటు చూసినప్పుడు దాని మీద 'ఫర్ సెన్సార్' అని ముద్ర కనిపించడంతో పాటు.. దానికి సంబంధించిన డేట్ స్టాంప్ కూడా ఉందట. అంటే, తాము సెన్సార్ చేయడానికి ఇచ్చిన ప్రింటును యథాతథంగా లీక్ చేసేశారని ఆరోపిస్తున్నారు. దాదాపు రెండు గంటల 20 నిమిషాల నిడివి కలిగిన మూవీ లీకైంది. దీనిపై మూవీ యూనిట్‌ను ప్రశ్నించగా వారు అధికారికంగా స్పందించలేదు. సినిమాను సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు 90కి పైగా కట్‌లు సూచించింది. అయితే, ఈ విషయంపై కోర్టుకెళ్లిన యూనిట్ ఒక కట్ తో 'ఏ' సర్టిఫికేట్ ను తెచ్చుకుంది.

Advertisement
Advertisement