జీఓఎంలో 10 మంది : చిదంబరం | Sakshi
Sakshi News home page

జీఓఎంలో 10 మంది : చిదంబరం

Published Sat, Oct 5 2013 4:10 AM

జీఓఎంలో 10 మంది : చిదంబరం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం)లో 10 మంది ఉండనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం దీనికి నేతృత్వం వహిస్తారని సమాచారం. కేంద్ర హోం, న్యాయ, జల వనరులు, మానవ వనరుల అభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఉపరిత రవాణా-హైవేలు, విద్యుత్, సిబ్బంది శాఖల మంత్రులతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా కూడా జీఓఎంలో ఉంటారు. ఇది ఆరు వారాల్లోగా తన సిఫార్సులను కేంద్రానికి అందజేస్తుందని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే శుక్రవారం ప్రకటించారు. బహుశా శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందన్నారు.
 
  తెలంగాణ, విభజన అనంతరం మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల నిర్ణయం, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు, న్యాయ, చట్ట, శాసన సంస్థలు, పాలనా విభాగాలతో పాటు నదీ జలాలు, హైదరాబాద్ తదితర అన్ని అంశాలనూ జీఓఎం పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటయ్యే క్రమంలో అవసరమయ్యే న్యాయ, ఆర్థిక, పాలనాపరమైన అంశాలను కూడా పరిశీలిస్తుంది. ఇక నదీజలాలు, సాగునీటి వనరులు, బొగ్గు, చమురు, సహజవాయువు వంటి ఇతర ప్రాకృతిక వనరుల పంపకంపైనా దృష్టి పెడుతుంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అంశాన్ని కూడా చేపడుతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తి, అప్పులతో పాటు విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరాల్లో వాటాలపై కూడా దృష్టి సారిస్తుంది. దాంతోపాటు 371డి అధికరణం కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా దఖలు పడిన సదుపాయాలను కూడా విభజన పరిణామాల నేపథ్యంలో పరిశీలిస్తుంది.
 
 ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందు కోస్తాంధ్రలో భాగంగా ఉన్న ఖమ్మం జిల్లా భద్రాచలాన్ని తిరిగి అటువైపే కలపాలంటూ వస్తున్న డిమాండ్లు తదితరాలనూ పరిశీలిస్తుంది. మరోవైపు డ్రాఫ్ట్ బిల్లు రూపకల్పనకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కొంతకాలం క్రితమే మొదలైనట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డ్రాఫ్టు చాలావరకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగానే రూపొందుతుందని అవి వివరించాయి. విభజన ప్రక్రియ వేగం చూస్తే ఇదంతా కేవలం రాజకీయ అనివార్యతలు, స్వప్రయోజనాల కోసం చేస్తున్నదే తప్ప లోతైన అధ్యయనంతో జరుగుతున్నది కాదని తేలిగ్గానే అర్థమవుతోందన్న వ్యాఖ్యలు సర్వత్రా విన్పిస్తున్నాయి!
 

Advertisement
Advertisement