10 వేల కోట్ల లాటరీ విజేత ఏమయ్యాడు? | Sakshi
Sakshi News home page

10 వేల కోట్ల లాటరీ విజేత ఏమయ్యాడు?

Published Mon, Feb 25 2019 4:57 AM

10 thousand crore lottery winner - Sakshi

సింప్సన్‌విల్లే: అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలోని సింప్సన్‌విల్లే అనే పట్టణంలో ఏకంగా 1.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 10,000 కోట్లు) లాటరీ గెలిచిన వ్యక్తి ఆ సొమ్మును ఇప్పటివరకు తీసుకోకపోవడం, అతను/ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలీకపోవడం మిస్టరీగా మారింది. అమెరికా చరిత్రలోనే లాటరీలో గెలిచిన రెండో అతిపెద్ద మొత్తం ఇదే. సింప్సన్‌విల్లేలోని కేసీ మార్ట్‌లో గతేడాది అక్టోబర్‌ 20 నుంచి 23 మధ్య ఎవరో ఒకరు ఈ లాటరీ కొన్నట్లు తెలుస్తోంది. అయితే గెలిచిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఇంతవరకు ఎందుకు బయటకు రాలేదో, ఆ డబ్బును ఎందుకు తీసుకోలేదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనిపై స్థానికులు ఎవరికి తోచిన కారణాలు వారు చెప్పుకుంటున్నారు.

కొందరేమో అంత డబ్బు గెలిచిన వ్యక్తి ఆ విషయం తెలిసిన వెంటనే ఒక్కసారిగా గుండె ఆగి చనిపోయి ఉంటారని అంటున్నారు. మరికొందరు ఆ లాటరీ టికెట్‌ ఎక్కడో గాలికి కొట్టుకుపోయి ఉంటుందనీ, అందుకే ఆ వ్యక్తి ఇప్పటివరకు డబ్బు తీసుకునేందుకు రాలేదని అంటున్నారు. ఇంకొందరేమో అతను పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతుంటాడనీ, లాటరీ సొమ్ము ఇచ్చే ముందు అతని నేపథ్యాన్ని పరిశీలిస్తే ఏమైనా నేరాలు బయటపడే అవకాశం ఉండటంతో ఇలా చేస్తుండొచ్చని అంటున్నారు. మరికొందరు అంత డబ్బు తీసుకునే ముందు ఇంకొన్ని రోజులు సాధారణ జీవితం గడపాలని అనుకుంటూ ఉండొచ్చని చెబుతున్నారు. ఏదేమైనా లాటరీ గెలిచిన వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్‌ 19లోపు ఆ డబ్బును తీసుకోకపోతే అది ఇంకెప్పటికీ ఆ వ్యక్తికి దక్కదు. ఆ లాటరీ టికెట్‌ను రద్దు చేస్తారు.  

Advertisement
Advertisement