పదేళ్ళ బాలుడికి భారత్ లో మొదటిసారి బైపాస్ సర్జరీ | Sakshi
Sakshi News home page

పదేళ్ళ బాలుడికి భారత్ లో మొదటిసారి బైపాస్ సర్జరీ

Published Tue, Mar 29 2016 8:54 PM

పదేళ్ళ బాలుడికి భారత్ లో మొదటిసారి బైపాస్ సర్జరీ - Sakshi

న్యూ ఢిల్లీః అతి చిన్న వయసులో ఓ బాలుడికి బైపాస్ సర్జరీ చేశారు. కేవలం పదేళ్ళ వయసున్న బాలుడికి బైపాస్ చికిత్స నిర్వహించడం ఇండియాలో ఇదే ప్రధమం. న్యూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విజయవంతా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు వైద్యులు పేర్కొన్నారు.  ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్ ఈ హెచ్ ఐ) డైరెక్టర్ డాక్టర్ రామ్ జీ మహ్రోత్రా పర్యవేక్షణలో ఈ కార్డియో థొరాకిక్ వాస్క్యులర్ సర్జరీ నిర్వహించారు. ఆర్టేరియల్ గ్రాఫ్ట్  ను ఉపయోగించి మహ్రోత్రా కొరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ నిర్వహించారు.

మధుర నివాసి అయిన పదేళ్ళ బాలుడు జన్యుపరమైన లోపంతో పుట్టాడు.  హోమోజిగస్ ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రోలేమియా గా పిలిచే అరుదైన వ్యాధిగా దీన్ని గుర్తించవచ్చని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి.  మూడు రోజుల పాటు ఛాతీ నొప్పితోపాటు, శ్వాస పరమైన ఇబ్బందికి బాలుడు గురయ్యాడని డైరెక్టర్ డాక్టర్ పీయూష్ జైన్ తెలిపారు. ఆస్పత్రికి వచ్చేప్పటికే అతడు ఓసారి గుండెపోటుతో బాధపడ్డాడని, ఇక ముందు గుండె ఆగిపోయేంతటి పరిస్థితి ఉందని తెలుసుకున్న వైద్యులు... రోగి పరిస్థితిని గమనించిన వెంటనే మరిన్ని పరిశోధనలతోపాటు, చికిత్స అందించేందుకు ఐసీయూకి తరలించినట్లు తెలిపారు.   

యాంజియో గ్రఫీ పరీక్ష నిర్వహించిన అనంతరం కరోనరీ ఆర్టరీ బ్లాకేజెస్ ఉన్నాయని గుర్తించి అందుకు అవసరమైన కరోనరీ ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్టింగ్ ను వెంటనే నిర్వహించామని, అతడి గుండె కేవలం 50 శాతం సామర్థ్యం తోనే పనిచేస్తోందని తెలుసుకున్నామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చిందని ఇంత చిన్న వయసులో బైపాస్ ఆపరేషన్ నిర్వహించడం వైద్యులకు ఓ సవాలేనని డాక్టర్ రాంజీ మెహ్రోత్రా అన్నారు. అంతేకాక అతడి గుండె కేవలం 22శాతం మాత్రమే కొట్టుకుంటుండటంతో ఆపరేషన్ తప్పనిసరి అయిందన్నారు.

ఇప్పటివరకూ పెద్దల గుండెకు  శస్త్ర చికిత్స చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయి తప్పించి... ఇటువంటి చిన్న వయసువారికి హార్ట్ సర్జరీ నిర్వహించేందుకు యంత్రాలు కూడ అందుబాటులో లేవన్నారు.  చాలా కాలంగా ధమనులు పనిచేయడం లేదన్న విషయాన్ని మరో పరిశీలనలో తెలుసుకున్నామని ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం కావడంతో రోగి కేవలం వారం రోజుల్లోనే ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడని తెలిపారు. వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల్లో ఒకటైన హైపర్ కొలెస్ట్రోలేమియా జన్యుపరమైన లోపమని, ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి రోగి పరిస్థితిని ప్రమాదకరంగా మారుస్తుందని ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ తెలిపారు.

Advertisement
Advertisement