వొళ్లొంచి పనిచేస్తే నిండు నూరేళ్లు | Sakshi
Sakshi News home page

వొళ్లొంచి పనిచేస్తే నిండు నూరేళ్లు

Published Mon, Sep 19 2016 7:31 PM

వొళ్లొంచి పనిచేస్తే నిండు నూరేళ్లు

తిరువనంతపురం: నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలంటే ఏం చేయాలి? పప్పాచన్‌లాగా కాయకష్టం చేయాలి. పప్పాచన్‌ అసలు పేరు ఆంటోని దేవస్య. ఆయనకు ఇప్పుడు అక్షరాల వందేళ్లు. ఇరవై ఎనిమిదేళ్ల వయస్సులోనే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. పదిరోజులపాటు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఆ తర్వాత వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా మలుచుకున్నారు. భార్యను తోడ్కొని ప్రతిరోజు పొలానికి వెళ్లడం, వొళ్లొంచి పనిచేయడం ఆయనకు వ్యాపకం. వ్యవసాయ జీవితాన్ని మొదలు పెట్టిన తన 64 ఏళ్ల జీవితంలో ఎన్నడు కూడా పొలానికి వెళ్లకుండా ఉండని రోజు లేదట.

80వ దశకంలో అడుగుపెట్టిన ఆయన భార్య త్రెస్సాయమ్మ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. కేరళలోని పొట్టాకుళంలో ఉధృతంగా సాగుతున్న దేశ స్వాతంత్య్ర పోరాటంలో పప్పాచన్‌ 1944లో చేరారు. ఆ సందర్భంగా అరెసై్ట ముండాక్యం జైల్లో పది రోజులు గడిపారు. ఆ తర్వాత తల్లి చనిపోవడంతో స్వగ్రామమైన పాలను వదిలేసి, చదువుకు స్వస్తి చెప్పి ఇదుక్కి వెళ్లారు. అక్కడ కొంత భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయాన్ని మొదలు పెట్టారు. వరితో సహా పల పంటలను పండించారు. ఇది తెలిసి ఆయన నలుగురు తమ్ముళ్లు కూడా వచ్చి ఆయనతోనే ఇదుక్కిలో స్థిరపడ్డారు.

1955లో అన్నపొలం వద్దనే వారు దాదాపు 20 ఎకరాలు వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. 1956లో పప్పాచన్‌ త్రెస్సాయమ్మను పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఇరువురి జీవితం పొలాలకే అంకితం అయింది. తాము ఈ వయస్సులో ఉన్నా ఆరోగ్యంగా ఉండడానికి అసలు కూడా కష్టపడి పనిచేయడమేనని పప్పాచన్‌ తనను కలసిన మీడియాకు తెలిపారు. పొద్దటి నుంచి సాయంత్రం వరకు పొలం పనులు చేస్తామని ఆయన చెప్పారు. భార్యా భర్తలు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదేమో!

Advertisement

తప్పక చదవండి

Advertisement