‘యోగా బామ్మ’ కన్నుమూత

26 Oct, 2019 20:33 IST|Sakshi

సాక్షి, చెన్నై:  తమిళనాడులోని కోయంబత్తూరుకుచెందిన ప్రఖ్యాత యోగా టీచర్‌ పద్మశ్రీ అవార్డు గ్రహీత  నానమ్మాళ్ (100) ఇక లేరు.  క్లిష్టమైన యోగాసనాలను కూడా చాలా సులువుగా ప్రదర్శిస్తూ ‘యోగా బామ్మ’గా  ప్రసిద్ది చెందిన నానమ్మాళ్ శనివారం కోయంబత్తూరులో కన్నుమూశారు.  రేపు(ఆదివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు నానమ్మాళ్‌ మృతిపై సంతాపం వ్యక్తంచేశారు.

గ్రామీణ వ్యవసాయదారుల కుటుంబం నుండి వచ్చిన ఆమె చిన్నతనం నుంచే యోగాసనాల్లో ఆరి తేరారు. ఫిబ్రవరి 1920న జన్మించిన ఆమె 10 సంవత్సరాల వయస్సు నుండే యోగాభ్యాసం చేయడం ప్రారంభించారు. తన తాతలు యోగా చేయడం చూసి యోగాపై మక్కువ పెంచుకున్నారు. ఆమె ప్రతిరోజూ కనీసం ఒకసారైనా యోగా చేస్తానని చెప్పేవారు. ఈమె దగ్గర శిక్షణ తీసుకున్న చాలామంది పలువురు  ప్రస్తుతం యోగా బోధకులుగా ఉన్నారు. దాదాపు 50 రకాల ఆసనాలను అవలీలగా వేయడం ఈ బామ్మ ప్రత్యేకత.

నానమ్మాళ్‌ ప్రతిభ, నైపుణ్యానికి గుర్తుగా 2018 లో పద్మశ్రీ అవార్డు లభించింది. 2016 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి నుంచి నారీశక్తి పురస్కార్ అవార్డును కూడా ఆమె గెల్చుకున్నారు.  2017లో కర్ణాటక ప్రభుత్వం ఇచ్చే యోగా రత్న అవార్డు దక్కింది. కోయంబత్తూరులో20 వేల మంది విద్యార్థులకు,  త్సాహికులకు యోగా నేర్పించడం ద్వారా నానమ్మల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన ఘనత ఆమె సొంతం.  ఎలాంటి అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో  జీవించిన ఆమె  దేశంలోనే ఓల్డెస్ట్ యోగా టీచర్ గా ఖ్యాతి గడించారు.

మరిన్ని వార్తలు