ఇక నుంచి అన్నిటికీ 112నే | Sakshi
Sakshi News home page

ఇక నుంచి అన్నిటికీ 112నే

Published Wed, Apr 8 2015 9:42 AM

ఇక నుంచి అన్నిటికీ 112నే - Sakshi

  • దేశవ్యాప్తంగా ఇదే నంబర్ ఉండాలంటూ కేంద్రానికి ట్రాయ్ సిఫారసు
  • అమెరికా తరహా విధానం అమలు చేయాలని సూచన
  • న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదానికి ఒక నంబర్.. పోలీస్‌కు ఒక నంబర్.. అంబులెన్స్‌కు ఒక నంబర్.. ఇలా ఒక్కోదానికి ఒక్కో నంబర్ కాకుండా అత్యవసర సమయాల్లో అన్నింటికి కలిపి ఒకే నంబర్ ఉండాలని ట్రాయ్ (టెలికం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రతిపాదించింది. అమెరికాలో అన్ని ఎమర్జెన్సీ సేవలకు కలిపి 911 ఉన్నట్టుగానే భారత్‌లో ‘112’ నంబర్ ఉండాలని సూచించింది. ప్రస్తుతం వివిధ ఎమర్జెన్సీలకు 100, 101, 102, 108 నంబర్లు వినియోగిస్తున్నారు.

     

    తొలుత వీటిని పూర్తిగా రద్దు చేయకుండా ఎవరైనా ఈ నంబర్లకు ఫోన్ చేస్తే ఆ కాల్‌ను 112కు బదిలీ చేయాలని పేర్కొంది. క్రమంగా 112 నంబర్‌పై భారీ ఎత్తున ప్రచారం చేస్తూ పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్రానికి సూచించింది. మొబైల్ లేదా ల్యాండ్‌లైన్‌తోపాటు ఈ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేసినా స్పందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొది. ఎస్‌ఎంఎస్ చేస్తే ఎక్కడ్నుంచి  దాన్ని పంపారన్న సమాచారంతోపాటు కొన్ని నిర్దేశిత వివరాలు టెలికాం ఆపరేటర్‌కు అందజేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేలా ‘పబ్లిక్ సేఫ్టీ ఆన్సరింగ్ పాయింట్స్(పీఎస్‌ఏపీ)’ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ట్రాయ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
     
    పీఎస్‌ఏపీ కింద కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, పరస్పర సమన్వయంతో అవి బాధితుల వద్దకు చేరేలా చూడాలని తెలిపింది. పీఎస్‌ఏపీ ఆపరేటర్లు హిందీ, ఇంగ్లిష్‌తోపాటు స్థానిక భాషల్లో మాట్లాడేవారి కాల్స్ కూడా స్వీకరించేలా ఏర్పాట్లు ఉండాలని సిఫారసు చేసింది. బాధితులను త్వరగా చేరేందుకు ఈ వ్యవస్థ కింద ఉండే పీసీఆర్ వ్యాన్లు, ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్‌లలో జీపీఎస్ టెక్నాలజీని వినియోగించాలని వివరించింది. ఎవరైనా కాల్ చేయగానే టెలికం ఆపరేటర్ వద్ద ఉండే డాటాబేస్ ద్వారా వారెక్కడున్నారన్న సమాచారం ఆటోమేటిక్‌గా పీఎస్‌ఏపీకి తెలిసిపోతుంది.

     

    ఆ తర్వాత ఆపరేటర్ స్థానికంగా ఉండే ఎమర్జెన్సీ విభాగాలకు సమాచారం అందవేస్తారు. అన్ని టెలికం కంపెనీల కస్టమర్లతో కూడిన పూర్తి వివరాలతో దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో ‘రీజినల్ డేటాబేస్’ను ఏర్పాటు చేయాలని, ఈ సమాచారం పీఎస్‌ఏపీకి అందుబాటులో ఉండేలా చూడాలని ట్రాయ్ పేర్కొంది. టెలికం కస్టమర్ల వ్యక్తిగత వివరాలు ఉండే ఈ నాలుగు డేటాబేస్ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించాలని సూచించింది.

Advertisement
Advertisement