12 వేల కోట్ల ఉపాధి నిధులు | Sakshi
Sakshi News home page

12 వేల కోట్ల ఉపాధి నిధులు

Published Sun, Apr 10 2016 1:45 AM

12 billion in funding for employment

రాష్ట్రాలకు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
 

 న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) నిధులపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ పథకానికి తన వాటా నిధులైన రూ. 12,230 కోట్లను శనివారం రాష్ట్రాలకు విడుదల చేసింది. ఏక మొత్తం ఇంత భారీగా నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ  మంత్రి బీరేందర్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది(2015-16) వేతన బకాయిల మొత్తం చెల్లింపుతో పాటు 2016-17 ఆర్థిక సంవత్సరంలో పథకం అమలుకు ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ పథకం లక్ష్యాలను సాధించేందుకుగానూ అన్ని వనరులను సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉపాధిహామీ పథకం అమలుకోసం రాష్ట్రాలకు సరిపడా నిధులను విడుదల చేయకపోవడంపై గత బుధవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరువు ప్రభావిత రాష్ట్రాల్లో ఈ పథకంపై చేసిన ఖర్చు వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. కాగా, ఉపాధిహామీ పథకానికి సంబంధించి వేతనాలు-మెటీరియల్ నిష్పత్తిని గ్రామ పంచాయతీ స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలోనే నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆస్తుల కల్పనకు జిల్లా స్థాయిలో 60ః40 నిష్పత్తిలో వేతనాలు-మెటీరియల్ నిష్పత్తిని నిర్వహించాలని నిర్ణయించినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement
Advertisement