కొండెక్కనున్న గణేశుడు.. | Sakshi
Sakshi News home page

కొండెక్కనున్న గణేశుడు..

Published Fri, Jun 20 2014 10:20 PM

కొండెక్కనున్న గణేశుడు.. - Sakshi

- ముడిసరుకు ధరల పెరుగుదలతో
- తగ్గనున్న విగ్రహాల తయారీ
- గిట్టుబాటు లేకపోవడంతో
- మూతపడిన పలు తయారీ కేంద్రాలు
- కూలీల కొరత కూడా కారణమే..

సాక్షి, ముంబై: ఈ ఏడాది గణేశ్ విగ్రహాల ధరలు సుమారు 20-25 శాతం పెరిగే అవకాశాలున్నాయి. విగ్రహాల తయారీకి వినియోగించే ముడిసరుకులు, రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇనుప చువ్వలు తదితర సామగ్రి ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ధరలు పెరిగిన దృష్ట్యా ఈ ఏడాది విగ్ర హాల ఉత్పత్తి కూడా తగ్గించినట్లు తయారీదారులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లో సరుకు కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు. గత ఏడాది గణపతి విగ్రహాల తయారీకి ఉపయోగించే 35 కే జీల బంకమట్టి సంచి రూ.170 లభించింది.

ప్రస్తుతం 20 కేజీల బంకమట్టికి రూ.200 వెచ్చించాల్సి వస్తోందని అంబర్‌నాథ్‌కు చెందిన నానా కడు అనే విగ్రహాల తయారీదారుడు తెలిపారు. విగ్రహాలకు తయారుచేసిన త ర్వాత వాడే రంగులు 20 శాతం మేర ధరలు పెరిగాయి. భారీ విగ్రహాలకు ఉపయోగించే నాణ్యమైన ఇనుప చువ్వల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. గిట్టుబాటు కాకపోవడంతో ఇప్పటికే అనేక విగ్రహాలు తయారుచేసే ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి. కార్మికులు దొరకడం కూడా కష్టతరంగా మారింది. వారికి చెల్లించే కూలిని రెట్టింపు చేసినా కూలీలు దొరకడం లేదు.

వారు డిమాండ్ చేసిన ంత కూలి చెల్లించడంతోపాటు భోజనం, బస ఏర్పాటు చేస్తే తప్ప కార్మికులు దొరకడం లేదు. ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తే విగ్రహాల తయారీ ఫ్యాక్టరీ యజమానులకు ఏమీ మిగలడం లేదు. ఏటా రాయ్‌గడ్ జిల్లాలోని పేన్, రోహ తాలూకాల నుంచి భారీ ఎత్తున విగ్రహాలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈసారి ధరలు మండిపోవడంతో అనేక మంది ఫ్యాక్టరీ యజమానులు ముందుగా ఆర్డర్లు స్వీకరించడం మానుకున్నారు. ముఖ్యంగా విగ్రహాల తయారీకి ఉపయోగించే బంక మట్టి గుజరాత్‌లో లభిస్తుంది. అక్కడి నుంచి ట్రక్కులో తీసుకురావడం యజమానులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో కొందరు విగ్రహాలను తయారుచేయడం నిలిపివేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement