చితికిన బతుకులు | Sakshi
Sakshi News home page

చితికిన బతుకులు

Published Sun, May 17 2020 3:46 AM

22 migrant workers eliminate in Madhya Pradesh road accident - Sakshi

ఔరైయా/భోపాల్‌: పొట్ట చేతపట్టుకొని రాష్ట్రం కాని రాష్ట్రానికి వలసవెళ్లిన బడుగుజీవుల బతుకుల్లో మరో విషాదం. లాక్‌డౌన్‌తో వలస వచ్చిన ప్రాంతంలో పనిలేక సొంత రాష్ట్రానికి పయనమైన వారిని రోడ్డు ప్రమాదాలు కబళించాయి. శనివారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాలు 33 మందిని విగతజీవులుగా మార్చాయి. ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌నకు సరుకులతో వెళ్తున్న లారీలో 22 మంది వలస కూలీలు ఎక్కారు. ఈ లారీ శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో 19వ నంబర్‌ జాతీయ రహదారిపై ఔరైయా–కాన్పూర్‌ దెహాట్‌ ప్రాంతంలో ధాబా వద్ద ఆగింది.

అదే సమయంలో గోధుమ పిండి లోడుతో వెళ్తున్న ట్రయిలర్‌ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ట్రయిలర్‌లో రాజస్తాన్‌ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన 43 మంది వలస కూలీలున్నారు. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా మరో 40 మంది గాయపడ్డారని కాన్పూర్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రమాద తీవ్రతకు రెండు ట్రక్కులు నుజ్జయి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయాయి. పరిస్థితి విషమంగా ఉన్న 15 మందిని ఇటావా జిల్లా సైఫైలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ ఆస్పత్రికి మిగతా వారిని ఔరైయా ఆస్పత్రికి తరలించారు.

మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటిం చారు. సొంతూళ్లకు వెళ్లే కార్మికుల కోసం రాష్ట్ర సరిహద్దుల్లో 200 బస్సులను సిద్ధంగా ఉంచామనీ, అయినా  కూలీలు ట్రక్కులు, లారీల్లో ప్రయాణిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఎస్‌హెచ్‌వోలను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘ఔరైయా ఘటన విచారకరం. వలస కార్మికుల సహాయక చర్యలను ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తుంది’అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మధ్యప్రదేశ్‌లో...
మధ్యప్రదేశ్‌లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది వలస కార్మికులు మృతి చెందగా 29 మంది గాయాలపాలయ్యారు. మహారాష్ట్ర నుంచి యూపీకి వలస కార్మికులతో వెళ్తున్న ఓ ట్రక్కు సాగర్‌ జిల్లాలో పల్టీ కొట్టడంతో అందులోని నలుగురు మహిళలు సహా ఆరుగురు చనిపోగా 18 మంది గాయపడ్డారు. అదేవిధంగా, గుణ జిల్లాలోని బదోరా వద్ద ట్రక్కు బోల్తా పడి అందులోని ఒక వ్యక్తి చనిపోగా 11 మంది కూలీలు గాయపడ్డారు. మరో ఘటన..ముంబై నుంచి వలస కూలీలతో యూపీ వైపు వెళ్తున్న ట్రక్కు భర్వానీ జిల్లా గౌఘాటి వద్ద మరో ట్రక్కును ఢీకొట్టగా ఒకరు చనిపోయారు.

Advertisement
Advertisement