Sakshi News home page

ఢిల్లీలో విషవాయువు కలకలం

Published Sun, May 7 2017 12:45 AM

ఢిల్లీలో విషవాయువు కలకలం - Sakshi

460 మంది విద్యార్థినులకు అస్వస్థత
► విష రసాయనం తీసుకెళ్తున్న కంటైనర్‌ లీకవడంతో ప్రమాదం
► అప్రమత్తమైన అధికారులు.. తప్పిన పెను ప్రమాదం  


న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ ప్రాంతం శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ కంటెయినర్‌ నుంచి విష రసాయనం లీకవడంతో సమీపంలోని పాఠశాలలకు చెందిన 460 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. చైనా నుంచి దిగుమతైన క్లోరోమిథైల్‌ పైరిడిన్‌ రసాయనాన్ని హరియాణాలోని సోనేపట్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా లీకై విషవాయువులు వ్యాపించాయి. దీంతో అక్కడికి సమీపంలో ఉన్న రాణి ఝాన్సీ స్కూలు, ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు కళ్ల మంటలు, కడుపునొప్పితో పాటు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు.

విషయం తెలియగానే ఘటనా స్థలానికి అంబులెన్సులతో పాటు పోలీసులు చేరుకుని.. విద్యార్థినులను సమీపంలో ఉన్న నాలుగు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. కొన్ని గంటల చికిత్స తర్వాత అధికశాతం విద్యార్థినుల్ని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని మాత్రం రెండు ఆస్పత్రుల్లోని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాత్రా ఆస్పత్రిలో దాదాపు 55 మంది విద్యార్థినులకు వైద్య సేవలందించామని, వారంతా సురక్షితంగానే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. అలాగే మజీతియా ఆస్పత్రిలో 107 మందికి చికిత్సనందించారు.

మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశం
విషయం తెలిసిన వెంటనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ఆసుపత్రులన్నీ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే వైద్య సేవలందించేందుకు ఎయిమ్స్‌ డాక్టర్ల బృందం సిద్ధంగా ఉండా లని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, ప్రతిపక్ష నేత విజేందర్‌ గుప్తా బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. 80 క్యాన్ల క్లోరోమిథైల్‌ పైరిడిన్‌(పురుగుమందుల తయారీలో వాడతారు)తో కూడిన కంటైనర్‌ తుగ్లకాబాద్‌ డిపో నుంచి తెల్లవారుజామున 3.30 గంటలకు హరియాణాలోని సోనేపట్‌కు బయల్దేరింది.

డిపో నుంచి బయటకు వచ్చాక టీ తాగేందుకు కంటైనర్‌ను సమీపంలోని రైల్వే కాలనీ వద్ద డ్రైవర్‌ ఆపాడు. ఈ సమయంలో కొంత రసాయనం లీకై రోడ్డుపై పడింది. అది గమనించని డ్రైవర్‌ సోనేపట్‌కు వెళ్లిపోయాడు. అయితే తుగ్లకాబాద్‌ ప్రాంతంలోని కస్టమ్స్‌ ఏరియాలో రసాయనం లీకై విషవాయువులు వ్యాపించాయంటూ ఉదయం 7.35 గంటలకు పోలీసులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. సమీపంలో పలు స్కూళ్లు ఉండడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అలాగే జాతీయ విపత్తు నివారణ బృందాలు(ఎన్డీఆర్‌ఎఫ్‌), సెంట్రలైజ్డ్‌ యాక్సిడెంట్‌ అండ్‌ ట్రామా సర్వీసెస్‌(క్యాట్స్‌)కు చెందిన అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ప్రారంభించాయి. గ్యాస్‌ లీకైన సమయానికి ఎక్కడా మంటలు లేకపోవడం, అలాగే వెంటనే అప్రమత్తమై విద్యార్థుల్ని తరలించడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది.

Advertisement
Advertisement