ఈ సమాధులు ప్రత్యేకమైనవి | Sakshi
Sakshi News home page

తవ్వకాల్లో బయటపడ్డ 4000 ఏళ్ల నాటి సమాధులు

Published Thu, Jun 7 2018 11:58 AM

4000 Years Old Civilization Found In Uttar Pradesh - Sakshi

లక్నో : భారతదేశంలో తొలిసారిగా అతి ప్రాచీన నాగరికతకు చెందిన సమాధుల్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బగ్‌పత్‌ జిల్లాలో కాంస్యయుగం నాటి సమాధులతో పాటు కొన్ని వస్తువులు పురావస్తు తవ్వకాలలో బయటపడ్డాయి. ఈ అవశేషాలు దాదాపు 4000ఏళ్ల నాటివని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్రీస్తుపూర్వం 2000-1800 ప్రాంతానికి చెందినవిగా వారు భావిస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్త మంజుల్‌ మాట్లాడుతూ.. గతంలో హరప్పా, మొహంజోదారో, ధొలవీర ప్రాంతాలలో తవ్వకాలు జరిపినపుడు చాలా సమాధులు బయటపడినా సమాధులపై రాగితో అలంకరణ చేయలేదన్నారు. ప్రస్తుతం బయటపడ్డ సమాధుల్లో ఎనిమిది మానవరూపాలను, పూల బొమ్మలను రాగితో తయారుచేసి ఉంచారని తెలిపారు.

సమాధుల్లో దొరికిన వస్తువులు, వాటిపై అలంకరణను బట్టి చూస్తుంటే ఆ సమాధులు రాజ కుటుంబాలకు చెంది ఉంటాయన్నారు. ఇలాంటి సమాధుల్ని కనుక్కొవటం భారతదేశ చరిత్రలో మొదటిసారన్నారు. ప్రపంచంలోనే అతిపురాతన నాగరికతలో ఒకటిగా చెప్పుకునే ‘‘మెసపుటేమియా’’ క్రీస్తుపూర్వం 3500 నాటిది. అప్పటి ప్రజలు యుద్ధ సమయంలో కత్తులు, రథాలు, శిరస్త్రాణాలు ఉపయోగించే వారు. భారతదేశంలో కూడా అలాంటి వస్తువులే బయటపడటం విశేషం. తవ్వకాలు జరిపిన ప్రాంతంలో అతి ప్రాచీనమైన నాగరికత విలసిల్లి ఉంటుందని పురావస్తు శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. మూడు నెలల పాటు కొనసాగిన తవ్వకాలలో శవపేటికలు, కత్తులు, బాకులు, దువ్వెనలు, ఆభరణాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 

1/1

తవ్వకాల్లో బయటపడ్డ రథం

Advertisement
Advertisement