'కేజ్రీవాల్ వచ్చినా అవినీతి అంతే ఉంది' | Sakshi
Sakshi News home page

'కేజ్రీవాల్ వచ్చినా అవినీతి అంతే ఉంది'

Published Wed, Feb 17 2016 9:40 AM

'కేజ్రీవాల్ వచ్చినా అవినీతి అంతే ఉంది' - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఢిల్లీ వాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఓ సర్వే తేల్చింది. ఇప్పటికీ అక్కడి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏమాత్రం తగ్గలేదని దాదాపు 77శాతం ఢిల్లీ ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పినట్లు సర్వే వెల్లడించింది. స్వరాజ్ అభియాన్ అనే సంస్థ ఫిబ్రవరి 10 నుంచి 14వరకు తన కార్యకర్తలతో దాదాపు పది నియోజకవర్గాల్లో 10 వేల ఢిల్లీ కుటుంబాలని ఆప్ సర్కార్ పనితీరుపై సర్వే నిర్వహించింది.

ఈ సర్వే ప్రకారం విద్యుత్ ఛార్జీలు ఏమాత్రం తగ్గలేదని 62శాతంమంది చెప్తుండగా.. ప్రతి నెల 20 వేల లీటర్ల తాగు నీరు ఇస్తామన్న హామీ కూడా అమలు కావడం లేదని వారు చెప్పినట్లు సర్వే పేర్కొంది. రామ్ లీలా మైదాన్ లో ఎలాంటి జన్ లోక్ పాల్ తీసుకొస్తానని కేజ్రీవాల్ చెప్పారో అది తీసుకురాలేదని 86శాతంమంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వివరించింది. ఇక రేషన్ షాపుల్లో కూడా అవినీతి దందా ఆగడం లేదని పేర్కొంది. స్వరాజ్ అభియాన్ సంస్థను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి బహిష్కరణకు గురైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement