వయసు 8ఏళ్లు.. సైబర్ భద్రతపై కీలక ప్రసంగం! | Sakshi
Sakshi News home page

వయసు 8ఏళ్లు.. సైబర్ భద్రతపై కీలక ప్రసంగం!

Published Thu, Nov 13 2014 9:56 AM

వయసు 8ఏళ్లు.. సైబర్ భద్రతపై కీలక ప్రసంగం!

ఈ బుడతడి వయసు నిండా చూస్తే 8 ఏళ్లు. కానీ ఏకంగా ఓ కంపెనీకి సీఈవో, సైబర్ భద్రత మీద నిర్వహించే సదస్సులో కీలక ప్రసంగం చేయబోతున్నాడు. ఇతడితో పాటు కీలక ప్రసంగాలు చేయబోయేవాళ్లలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ కూడా ఉన్నారు!! రూబెన్ పాల్ అనే ఈ బుడతడు భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు. కొత్త తరానికి సైబర్ భద్రతా నైపుణ్యాలు ఎందుకు అవసరమో అతడు వివరించనున్నాడు. సెక్యూరిటీ సదస్సులో ఎనిమిదేళ్ల రూబెన్ పాల్ కీలక ప్రసంగం చేస్తాడని సదస్సు నిర్వాహకులు తెలిపారు. తాను ఏడాదిన్నర క్రితం నుంచే కంప్యూటర్ లాంగ్వేజిలు నేర్చుకోవడం మొదలుపెట్టానని, ఇప్పుడు తన సొంత ప్రాజెక్టులు తానే డిజైన్ చేసుకుంటున్నానని రూబెన్ తెలిపాడు.

రూబెన్కు అతడి తండ్రి మనో పాల్ కంప్యూటర్ పాఠాలు చెప్పారు. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజి గురించి మొదట్లో వివరించారు. ఇప్పుడు యాపిల్ ఐఓఎస్ ప్లాట్ఫాం మీద స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ నేర్పుతున్నారు. ఒడిషాలో పుట్టిన మనో పాల్.. 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లిపోయారు. ఆగస్టు నెలలో రూబెన్ తన సొంత గేమింగ్ సంస్థ ప్రూడెంట్ గేమ్స్ను ప్రారంభించాడు. దానికి రూబెన్ సీఈవో కాగా, అతడి తండ్రి కూడా ఆ సంస్థలో భాగస్వామి. రూబెన్ సైబర్ భద్రత మీద సదస్సులలో ప్రసంగాలు చేయడం ఇది నాలుగోసారి. పిల్లల్లో సైబర్ భద్రతా నైపుణ్యాల గురించి చెప్పడంతో పాటు.. వైట్పేజి హ్యాకింగ్ మీద కూడా డెమో ఇస్తాడట.

Advertisement
Advertisement