ఆధార్‌ ఓ ఎలక్ట్రానిక్‌ పగ్గం | Sakshi
Sakshi News home page

ఆధార్‌ ఓ ఎలక్ట్రానిక్‌ పగ్గం

Published Thu, Jan 18 2018 2:07 AM

Aadhaar an 'electronic leash' on citizens: Senior advocate Shyam Divan in Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ అనేది ఒక ఎలక్ట్రానిక్‌ పగ్గం లాంటిదనీ, జంతువులను తాళ్లతో కట్టేసినట్లు ప్రభుత్వం ఆధార్‌తో ప్రజలను బంధిస్తోందని న్యాయవాది శ్యాం దివన్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆధార్‌ రాజ్యాంగ బద్ధతను సవాల్‌ చేస్తూ వచ్చిన పిటిషన్లపై బుధవారం విచారణ ప్రారంభించింది. పిటిషనర్ల తరఫున శ్యాం వాదనలు వినిపించారు. ‘ఆధార్‌ ఒక ఎలక్ట్రానిక్‌ పగ్గం లాంటిది. ఇది సెంట్రల్‌ డేటాబేస్‌కు కనెక్ట్‌ అయ్యి ఉంటుంది.

పౌరుల రోజువారీ కార్యకలాపాలను, అలవాట్లను గమనించే అవకాశం ఇవ్వడం ద్వారా మెల్లగా ప్రజల్లో అసమ్మతిని అణచివేసి, ప్రభుత్వానికి అనుకూలంగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురాగలదు. ప్రతి దానికీ ఆధార్‌ను లింక్‌ చేయడం వల్ల ఏ పని చేయాలన్నా అది అవసరమవుతుంది. ఆధార్‌ నంబర్‌ లేకుండా బతకలేమనే స్థితి వస్తుంది. అప్పుడు ప్రభుత్వంలోని వారికి ఎవరిపైనైనా ఆగ్రహం వస్తే వారి ఆధార్‌ నంబర్‌ను స్విచాఫ్‌ చేస్తే చాలు. సామాజికంగా ఆ వ్యక్తి మరణించినంత పనవుతుంది. ఇలా ఇది ప్రజల్లో అసమ్మతి అనేదే లేకుండా చేస్తుంది’ అంటూ శ్యాం వాదించారు. తదుపరి వాదనలు గురువారం కొనసాగనున్నాయి.

Advertisement
Advertisement