‘నీట్‌’కు ఆధార్‌ తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు | Sakshi
Sakshi News home page

‘నీట్‌’కు ఆధార్‌ తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు

Published Thu, Mar 8 2018 3:07 AM

Aadhaar not mandatory to appear for NEET: Centre to Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: నీట్‌–2018, ఇతర ఆలిండియా పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి చేయొద్దని సీబీఎస్‌ఈకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది.

నీట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా సమర్పించాలన్న సీబీఎస్‌ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గతంలో గుజరాత్‌ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌పై బుధవారం వాదనలు జరిగాయి. వాదనల సందర్భంగా నీట్‌–2018కి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల నుంచి ఆధార్‌ వివరాలు సేకరించే అధికారం సీబీఎస్‌ఈకి లేదని యూఐడీఏఐ కోర్టుకి తెలిపింది. దీంతో నీట్‌ దరఖాస్తుదారులకు ఆధార్‌ తప్పనిసరి చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.  

Advertisement
Advertisement