ఢిల్లీలో ఆప్ క్లీన్ స్వీప్.. 67 స్థానాల్లో విజయం | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఆప్ క్లీన్ స్వీప్.. 67 స్థానాల్లో విజయం

Published Tue, Feb 10 2015 3:15 PM

ఢిల్లీలో ఆప్ క్లీన్ స్వీప్.. 67 స్థానాల్లో విజయం - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. ఆప్ సృష్టించిన సునామీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోయాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ కేవలం మూడు సీట్లు గెల్చుకుని ప్రతిపక్ష హోదా కూడా సాధించకపోగా, కాంగ్రెస్ పార్టీ అయితే బోణీ కూడా కొట్టలేకపోయింది. సోమవారం ఉదయం మొదలైన కౌంటింగ్ మధ్యాహ్నానికి పూర్తయ్యింది. మొత్తం 70 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి.

ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. కేజ్రీవాల్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నుపుర్ శర్మపై 31,583 ఓట్ల తేడాతో గెలిచారు. కాగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు.  బీజేపీకి కంచుకోటలాంటి కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె  ఆప్ అభ్యర్తి ఎస్కే బగ్గా చేతిలో 2277 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయ శర్మిష్ఠ ఘోరపరాయం పాలయ్యారు. ఆమెకు కేవలం 6 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి.

ఆప్ కార్యకర్తుల సంబరాల్లో మునిగిపోగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దగ్గర నిర్మానుష వాతావరణం కనిపించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement