ఎమ్మెల్యేలకు ఎంపీ టిక్కెట్ ఇచ్చేది లేదు‌! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలకు, మంత్రులకు నో ఎంపీ టిక్కెట్‌!

Published Thu, Jan 24 2019 9:56 AM

AAP Says No Sitting MLA And Minister To Get Party Ticket For Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు గానీ, మంత్రులకు గానీ రానున్న లోక్‌సభ ఎన్నికలలో టికెట్‌ ఇవ్వకూడదని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ నెలాఖరులోగా ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుందని పార్టీ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌ చెప్పారు. ఎమ్మెల్యేలను, మంత్రులను లోక్‌సభ ఎన్నికలలో అభ్యర్థులుగా నిలబెట్టరాదని కూడా పార్టీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ బూత్‌ స్థాయి పనులను ఇప్పటికే ప్రారంభించింది.

ఢిల్లీలో లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను పార్టీ ఇప్పటికే ప్రకటించింది. వారే లోక్‌సభ అభ్యర్థులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈశాన్య ఢిల్లీకి దిలీప్‌ పాండేను, చాందినీ చౌక్‌కు పంకజ్‌ గుప్తాను, వాయవ్య ఢిల్లీకి గుజ్జన్‌ సింగ్‌ రంగాను, బ్రజేష్‌ గోయల్‌ను న్యూఢిల్లీకి, పశ్చిమ ఢిల్లీకి రాజ్‌పాల్‌ సోలంకీని, తూర్పు ఢిల్లీకి అతిషీని, దక్షిణ ఢిల్లీకి రాఘవ్‌ చద్దాలను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించింది. లోక్‌సభ అభ్యర్థులుగా వీరికే టికెట్లు లభించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నప్పటికీ వీరిలో కొందరు పూర్తిగా కొత్త ముఖాలు కావడం వల్ల పార్టీ వారికి లోక్‌సభ టికెట్‌ ఇవ్వకపోవచ్చని కొందరు అంటున్నారు.
 

Advertisement
Advertisement