కేంద్ర మంత్రిపై రాష్ట్రపతికి ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రిపై రాష్ట్రపతికి ఫిర్యాదు

Published Thu, Mar 10 2016 4:49 PM

కేంద్ర మంత్రిపై రాష్ట్రపతికి ఫిర్యాదు - Sakshi

ఆగ్రా: గత శనివారం రాత్రి యమునా ఎక్స్ ప్రెస్వేపై ప్రమాదానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాన్వాయే కారణమని బాధితులు ఆరోపించారు. ఆ రోడ్డు ప్రమాదంలో ఆగ్రాకు చెందిన వైద్యుడు రమేష్ నగార్ మృతి చెందగా, పలువురు వ్యక్తులు గాయపడ్డ విషయం తెలిసిందే.  ఈ ఘటనకు సంబంధించి స్మృతి ఇరానీ పై చర్య తీసుకోవాలని మృతిచెందిన డాక్టర్ కుమారుడు అభిషేక్ నగార్ తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని  అభిషేక్, ప్రణబ్ ను కోరాడు.

తమ ఫిర్యాదులో కాన్వాయ్ నెంబర్ పేర్కొన్నప్పటికీ మథుర పోలీసులు అందుకు నిరాకరించారని రాష్ట్రపతికి రాసిన లేఖలో అభిషేక్ పేర్కొన్నాడు.  ఆ వాహనం నెంబర్ డీఎల్ 3సీ బీఏ 5315 (DL 3C BA 5315) అని వెల్లడించాడు. తన తండ్రి ఓ వివాహానికి బైక్ పై వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో తన కూతురు సాందిలి(12), మరో చిన్నారి పంకజ్(8) గాయపడ్డారని వివరించాడు. మంత్రి కాన్వాయ్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, స్మృతి ఇరానీ ఆ గాయపడ్డ ఇద్దరు చిన్నారులను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయిందని తమకు న్యాయం చేయాలని తన లేఖలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు.

Advertisement
Advertisement