సదాఫ్‌ జాఫర్‌కు బెయిల్‌

4 Jan, 2020 20:21 IST|Sakshi

లక్నో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఆందోళన సందర్భంగా లక్నోలో జరిగిన హింసాత్మక ఘటనల వెనక సామాజిక కార్యకర్త సదాఫ్‌ జాఫర్‌ ప్రత్యక్ష పాత్ర ఉందని నిరూపించడంలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు విఫలమయ్యారు. దీంతో లక్నో సెషన్స్‌ కోర్టు శనివారం ఆమె​కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. సదాఫ్‌ జాఫర్‌తో పాటు మాజీ ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ దారపూరి, మరో పదిమందికి బెయిల్‌ మంజూరు చేస్తూ అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఎస్‌ఎస్‌ పాండే ఉత్తర్వులిచ్చారు. రూ. 50 వేలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని నిందితులను ఆదేశించారు. గత డిసెంబర్‌ 19న లక్నోలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంగా అల్లర్లు చోటుచేసుకోవడంతో వీరందరిని పోలీసులు అరెస్టు చేసి ఐఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. రేపు (ఆదివారం) కోర్టుకు సెలవు కావడంతో సోమవారం వీరందరూ బెయిల్‌పై విడుదల కానున్నారు. సదాఫ్‌కు బెయిల్‌ మంజూరు చేయడంతో కోర్టుకు ఆమె తరపు న్యాయవాది హర్‌జ్యోత్‌ సింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. (నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు: సదాఫ్‌ జాఫర్‌)

కాగా, జాఫర్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆమె తరపు న్యాయవాది హర్‌జ్యోత్‌ సింగ్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను గురువారం విచారించిన అలహాబాద్ హైకోర్టు.. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలో ఎస్పీ హోదాలో ఉన్న అధికారితో ఈ కేసును దర్యాప్తు చేయించాలని కూడా పిటిషనర్‌ కోరారు. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు