ఢిల్లీలో కదంతొక్కిన ఆదివాసీలు 

10 Dec, 2019 03:34 IST|Sakshi
ధర్నాలో పాల్గొన్న ఆదివాసీలు

దేశ రాజధాని వేదికగా అస్తిత్వ పోరాటం

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: హక్కుల సాధన కోసం ఆదివాసీలు కదంతొక్కారు. అస్తిత్వ పోరాటాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఉధృతం చేశారు. తమ హక్కులను కాలరాస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సోమవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం జోడెఘాట్‌ కేంద్రంగా పురుడుపోసుకున్న ఉద్యమం ఢిల్లీకి చేరింది. ఆదివాసీల హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు వేల సంఖ్యలో ఆదివాసీలు తరలివచ్చారు.

ప్రత్యేక రైళ్లు, వాహనాల్లో ఢిల్లీ బాటపట్టారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ భూమిపై హక్కులు కల్పించాలని, ఆదివాసీలపై అటవీ అధికారుల దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల నుంచి ఆదివాసీలు ధర్నాలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో సరైన విధానం పాటించకుండా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారని, దీనివల్ల ఆదివాసీలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పొందలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ఆందోళన చేపట్టినట్టు తెలిపారు.  

వందలో మూడు ఉద్యోగాలు కూడా దక్కడం లేదు: సోయం  
లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారని, వందలో 3 ఉద్యోగాలు కూడా ఆదివాసీలకు దక్కడం లేదని, 97 శాతం రిజర్వేషన్‌ ఫలాలు లంబాడాలకే దక్కుతున్నాయని బీజేపీ ఎంపీ, సమితి అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆది వాసీలు హక్కులు కోల్పోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ సభ నిర్వహించినట్టు తెలిపారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, ఎమ్మెల్యే సీతక్క సహా పలు రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా