సీఎస్‌టీ చెల్లించాకే జీఎస్‌టీ | Sakshi
Sakshi News home page

సీఎస్‌టీ చెల్లించాకే జీఎస్‌టీ

Published Thu, Apr 23 2015 3:31 AM

బుధవారం ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్

  • ఆర్థిక మంత్రులతో సదస్సులో తెలంగాణ మంత్రి ఈటల
  • కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశంలో తెలంగాణకు స్పెషల్ స్టేటస్, అభివృద్ధి నిధులపై చర్చ
  • కేంద్ర వ్యవసాయశాఖ, పౌరసరఫరాల  శాఖ మంత్రులతో భేటీ
  • సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెల్లించాల్సిన సీఎస్‌టీ బకాయిలు చెల్లించిన తర్వాతే వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను అమలు చేయాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 2016 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ అమలు చేయాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మొదట రాష్ట్రాలకు చెల్లించాల్సిన సీఎస్‌టీ బకాయిలు ఇస్తే భరోసా కలుగుతుందని అన్నారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో బుధవారం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో  నిర్వహించిన ఎంపవర్డ్ కమిటీ సమావేశానికి తెలంగాణ తరఫున ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు.

    తెలంగాణ ప్రభుత్వం జీఎస్‌టీ అమలును స్వాగతిస్తోందని, అయితే పొగాకు ఉత్పత్తులు, పెట్రోల్ ఉత్పత్తులు, ఎకై్సజ్, ప్యాడీ ఉత్పత్తులను జీఎస్‌టీ నుంచి మినహాయించాలని కోరారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి నిధులపై చర్చించారు. ఒక్క రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తోనూ ఈటల సమావేశమయ్యారు. అంతకుముందు ఢిల్లీ ఏపీభవన్ గురజాడ సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు సీఎస్‌టీ బకాయి మొత్తం రూ.7,049 కోట్లు రావాల్సి ఉండగా, మొదటి విడతగా 2010-11 బకాయి రూ. 454.6 కోట్లు బుధవారం విడుదల  చేసినట్టు ఈటల పేర్కొన్నారు.

    మిగిలిన మొత్తాన్ని మరో రెండు విడతల్లో విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినా, కేంద్ర పథకాల నిధుల్లో కోత విధించడంతో  తెలంగాణకు ఏటా రావాల్సిన ఆదాయానికి రూ. 2,389 కోట్లమేర గండి పడిందన్నారు. గతేడాదితో పోలిస్తే తెలంగాణకు ఈ ఏడాది కేంద్ర నుంచి వచ్చే నిధులు రూ. 4,622 కోట్లు తగ్గాయని పేర్కొన్నారు.    పేదలను 1.91 కోట్లుగా గుర్తించాలి
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లెక్కల ప్రకారం తెలంగాణలో పేదల సంఖ్య 1.91 కోట్లుగా గుర్తించారని, తెలంగాణలో పేదల సంఖ్య వాస్తవానికి 2.86 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ కేంద్ర నుంచి బియ్యం కోటా ఇవ్వాలని ఈటెల కేంద్ర మంత్రి పాశ్వాన్‌ను కోరారు. సంక్షేమ హాస్టళ్లకు బియ్యం కోటా పెంచాలని, చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపకంలో అక్రమాలకు తావు లేకుండా ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే రూ. 225 కోట్లు కేటాయించాలని, హమాలీ చార్జీలను పెంచాలని, పాత లెవీ విధానాన్ని అమలు చేసేలా పునరాలోచించాలని కోరారు.


    కేంద్ర సాయం అందేవరకు రాష్ట్ర నిధులు వాడుకోండి
    అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర సాయం వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను వాడుకోవాలని కేంద్ర వ్యవ సాయ శాఖ మంత్రి రాధామోహ న్‌సింగ్ సూచించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన తెలంగాణ రైతులను ఆదుకోవాలంటూ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ఎంపీల బృందం కేంద్రమంత్రిని బుధవారం ఢిల్లీలో కలసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను రూ.100 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచామని, అప్పటి వరకు ఆ నిధులను వాడుకోవాలని ఆయన సూచించారు.

    త్వరలో బిల్లు తెస్తాం: జైట్లీ
    జీఎస్‌టీపై బుధవారం రాష్ట్రాలతో జరిగిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ...త్వరలోనే పార్లమెం టులో బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చిందని, అందరికీ లాభదాయకమైన ఏకీకృత జీఎస్‌టీని ప్రవేశపెట్టడానికి వీలుగా రెండు, మూడు రోజుల్లో రాజ్యాంగసవరణ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. జీఎస్‌టీ మూలంగా తమకు వాటిల్లే ఆదాయ నష్టానికి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పరిహారమివ్వాలని కొన్ని రాష్ట్రాలు కోరాయి. మహారాష్ట్ర, గుజ రాత్ లాంటి రాష్ట్రాలు జీఎస్‌టీపై అదనంగా 2 శాతం పన్ను వేసుకునేందుకు రాష్ట్రాలకు వీలుండాలని కోరాయి. ప్రస్తుత జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ బిల్లులో రాష్ట్రాలకు ఒక శాతం మాత్రమే అదనంగా పన్ను వేసుకునే అధికారం ఉంది.

Advertisement
Advertisement