చెంపదెబ్బకు నిరసనగా వైద్య సేవలు బంద్‌ | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 27 2018 1:46 PM

 AIIMS, Resident Doctors Association Calls Indefinite Strike - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎయిమ్స్‌లో రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోషియేషన్‌ (ఆర్‌డీఏ) గురువారం నిరవధిక నిరసనలకు పిలుపునిచ్చింది. తమ సహ విద్యార్థి (రెసిడెంట్‌ డాక్టర్‌)పై సీనియర్‌ డాక్టర్‌ చేయిచేసుకున్నారని ఆర్‌డీఏ ఆరోపించింది. ఆయన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్‌ చేయాలని, దాడికి గురైన విద్యార్థికి లిఖితపూర్వక క్షమాపణలు తెలపాలని డిమాండ్‌ చేసింది.

ఆయన పరీక్షల నిర్వహణలో, పరిశోధనా పత్రాల మూల్యంకనంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఎయిమ్స్‌ పరిపాలనా విభాగాన్ని ఆర్‌డీఏ కోరింది. ఆర్‌డీఏ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియాకు రాసిన లేఖలో.. సదరు సీనియర్‌ వైద్యుడు రెసిడెంట్‌ డాక్టర్‌ను అవమానించారు. తన సహోద్యోగులు, ఇతర నర్సింగ్‌ సిబ్బంది ఎదుటే చెంపదెబ్బ కొట్టాడని పేర్కొంది. ఆయన ప్రవర్తనతో ఎంతోకాలంగా తాము ఇబ్బందులకు గురౌతున్నామని, పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తాడేమోనన్న భయంతో ఇన్నిరోజులు ఆయనపై ఫిర్యాదు చేయలేదని తెలిపింది.

అత్యవసర సేవలు కొనసాగుతాయి..
ఆర్‌డీఏ నిరవధిక సమ్మెతో రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని ఎయిమ్స్‌ పరిపాలనా వర్గాలు తెలిపాయి. డాక్టర్లు సరిపడా అందుబాటులో ఉండని కారణంగా సాధారణ శస్త్రచికిత్సల్ని నిలిపి వేశామని వెల్లడించింది. అత్యవసర, ఐసీయూ సేవలు, పరిమిత సంఖ్యలో ఔట్‌పేషెంట్‌ క్లినిక్‌లు అందుబాటులోఉంటాయని పేర్కొంది. విద్యా సంబంధిత కార్యకలాపాలను, పరీక్షలను తాత్కాలికంగా నిలుపుదల చేశామని తెలిపింది.

అన్ని స్పెషలిస్టు డాక్టర్ల సేవలు కొనసాగేలా చర్యలు తీసుకున్నామని ఎయిమ్స్‌ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. డాక్టర్ల అందుబాటుని బట్టి ఇన్‌పేషెంట్‌ సేవలు కొనసాగుతాయని పేర్కొంది. విద్యార్థిపై దాడి ఘటన బుధవారం చోటుచేసుకుందని,  దాడికి పాల్పడిన సీనియర్‌ డాక్టర్‌ సదరు విద్యార్థికి క్షమాపణలు చెప్పారని తన ప్రకటలో వెల్లడించింది.

Advertisement
Advertisement