టేకాఫ్ అయిన ఆరు గంటలకు వెనక్కి!

11 Mar, 2014 04:21 IST|Sakshi

న్యూఢిల్లీ: షికాగోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సోమవారం టేకాఫ్ అయిన ఆరు గంటల తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం ‘బోయింగ్ 777-300 ఈఆర్’ ట్రాన్స్‌పాండర్‌లో వైఫల్యం తలెత్తడంతో ఉదయం 5 గంటలకు పైలట్ తిరిగి వెనక్కి తీసుకువచ్చినట్లు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి. సంఘటన సమయంలో విమానంలో 313 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు.
 
 టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత అఫ్ఘానిస్థాన్‌ను దాటుతుండగా విమానంలో ట్రాన్స్‌పాండర్ విఫలమైంది. దీంతో ట్రాన్స్‌పాండర్ పనిచేయకపోతే ఐరోపాలోకి ప్రవేశించే అవకాశం లేకపోవడంతో పైలట్ విమానాన్ని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. ప్రయాణికులను షికాగో చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా అధికారులు తెలిపారు. కాగా 15 రోజుల క్రితం కూడా అఫ్ఘానిస్థాన్ మీదుగా వెళుతుండగా ఓ ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌లో ట్రాన్స్‌పాండర్ విఫలమైంది. గతకొద్ది నెలలుగా బోయింగ్ విమానాల్లో తరచూ ట్రాన్స్‌పాండర్లు విఫలమవుతుండటంతో అమెరికా సంస్థ బోయింగ్‌కు ఎయిరిండియా ఫిర్యాదు కూడా చేసింది.

>
మరిన్ని వార్తలు