ఏడాదిలోగా విచారణ పూర్తి | Sakshi
Sakshi News home page

ఏడాదిలోగా విచారణ పూర్తి

Published Tue, Mar 11 2014 5:33 AM

ఏడాదిలోగా విచారణ పూర్తి - Sakshi

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
 న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను.. అభియోగాలు నమోదైన ఏడాదిలోపే పూర్తి చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులు, కిందిస్థాయి కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఆ కేసుల్లో రోజువారీ విచారణను చేపట్టాలని సూచించింది. అత్యంత హేయమైన నేరాలతో సంబంధమున్న ప్రజాప్రతినిధులు.. విచారణలో జాప్యం కారణంగా పదవుల్లో కొనసాగుతున్నారని వ్యాఖ్యానించింది.
 
-     పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను సోమవారం సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
- క్రూరమైన నేరాలతో సంబంధం ఉన్న కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు.. కోర్టుల్లో విచారణ సుదీర్ఘంగా సాగుతుండడంతో పదవుల్లో కొనసాగుతున్నారని ఆ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది.
-     అందువల్ల వారిపై విచారణను అతి శీఘ్రంగా పూర్తి చేసేలా కోర్టులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
-     దీనిని పరిశీలించిన ధర్మాసనం... ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల్లో అభియోగాలు నమోదైన ఏడాదిలోపే విచారణ పూర్తి చేయాలని కింది కోర్టులకు ఆదేశించింది.
-     ఇందుకోసం రోజువారీ విచారణ చేపట్టాలని సూచించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8(1), 8(2), 8(3) సెక్షన్ల కింద ఈ ఆదేశాలిస్తున్నట్లు పేర్కొంది.
-     ఒకవేళ ఏడాదిలోపు విచారణ పూర్తి చేయలేకపోతే.. అందుకు తగిన కారణంపై తామున్న పరిధిలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరణ ఇవ్వాలని సూచించింది.
-     ఆ వివరణపై సంతృప్తి చెందితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరికొంత కాలం గడువు ఇవ్వొచ్చని పేర్కొంది.
-     అయితే విచారణ కోసం గడువును ఆరు నెలలుగా నిర్ణయించడానికి ధర్మాసనం తొలుత సిద్ధమైనా.. న్యాయ కమిషన్ సిఫార్సుల మేరకు ఏడాదిగా నిర్ణయించింది.
-     ఐదేళ్ల కన్నా ఎక్కువ శిక్షపడే నేరాభియోగాలు నమోదైన ప్రజాప్రతినిధులను వెంటనే పదవుల నుంచి తొలగించాలన్న న్యాయ కమిషన్ సూచనను ప్రస్తుతం సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పరిగణనలోకి తీసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

Advertisement
Advertisement