చుక్కలు చూపించిన ఎయిర్ ఇండియా | Sakshi
Sakshi News home page

చుక్కలు చూపించిన ఎయిర్ ఇండియా

Published Mon, Mar 21 2016 1:23 PM

చుక్కలు చూపించిన ఎయిర్ ఇండియా - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి రావాల్సిన కోల్కతా-ఢిల్లీ విమానం(701).. 14 గంటలు ఆలస్యంగా సోమవారం ఉదయం చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కోల్కతా విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయంలోనే వేచి చూడాల్సి వచ్చింది. అయితే ఆదివారం సాయంత్రం మరో సర్వీసు ఏర్పాటు చేసినా ఫైలెట్, సిబ్బంది లేకపోవడం మరింత ఆలస్యానికి కారణమైందని ప్రయాణికులు తెలిపారు.

అదే సమయంలో పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కూడా విమానంలో ఉన్నారు. సమస్య తలెత్తిన వెంటనే ఆయనతో పాటు 50 మంది ప్రయాణికులు వేరే విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు. ఆ తర్వాత రెండు, మూడు గంటలైనా ఎయిర్ ఇండియా అధికారులు పట్టించుకోకపోవంతో ప్రయాణికులు టెర్మినల్ లోనే ఆందోళన చేశారు. ప్రత్యామ్నయ విమాన సర్వీసును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఉన్నతాధికారులపై మండిపడ్డారు. విమానం ఆలస్యమవడంతో వృద్దులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు పడాల్సి వచ్చింది. కాగా అదే విమానంలో ఉన్న సీపీఎం నేత సీతారాం ఏచూరికి మాత్రం అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



Advertisement
Advertisement