ఇక బస్సులకూ డిజైన్‌ కోడ్‌ | Sakshi
Sakshi News home page

ఇక బస్సులకూ డిజైన్‌ కోడ్‌

Published Sat, Jul 29 2017 1:20 AM

ఇక బస్సులకూ డిజైన్‌ కోడ్‌

మార్గదర్శకాలను రూపొందించిన కేంద్రం
అక్టోబర్‌ ఒకటి నుంచి అమల్లోకి..


సాక్షి, హైదరాబాద్‌: ఒక్కో బస్సులో ఒక్కోలా సీట్లు.. ఒకదానికి మెట్లు ఎక్కువ ఎత్తు.. మరో దానిలో కూర్చుంటే కాళ్లకు తగిలేలా ముందటి సీట్లు.. ఓ బస్సుకు రెండు తలుపులు.. ఇంకో బస్సు ఎక్కాలంటే ఒకే తలుపు.. ఇలా ఒక్కో బస్సులో ఒక్కోలా ఉంటోంది. ఇటు ప్రయాణి కులు, అటు డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండే లా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐఎస్‌–052 కోడ్‌ పేరిట బస్‌ బాడీ కోడ్‌ను అమల్లోకి తెస్తోంది. అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంతో ఇక దేశవ్యాప్తంగా బస్సులన్నీ కేటగిరీల వారీగా ఒకే తరహాలో ఉండను న్నాయి. ప్రమాదాలను నివారించేలా, ఒకవేళ ప్రమాదాలు జరిగితే సులువుగా బయటపడేలా బస్‌బాడీ నిర్మాణం, ప్రయాణికులకు వీలైనంత ఎక్కువ సౌకర్యవంతమైన సీట్లు, డ్రైవర్‌ క్యాబిన్‌ విషయంలో ప్రత్యేక నిబంధనలను ఇందులో పొందుపరిచారు.

ఈ విషయమై ఇప్పటికే బస్‌ బాడీ నిర్మాణ సంస్థలకు మార్గద ర్శకాలు జారీ చేశారు. ఈ నిబంధనలకు లోబడే కొత్త బస్సుల తయారీ ఉండాలని, అతి క్రమిస్తే చర్యలు తప్పవని నిర్మాణ సంస్థల ప్రతి నిధులకు స్పష్టం చేశారు. ఈ మార్గదర్శకాలపై అవగాహన కల్పించేందుకు పుణెలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు ప్రతినిధు లు దేశవ్యాప్తంగా ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వ హిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం బస్‌భవన్‌లో సదస్సు ఏర్పాటు చేశారు. తెలం గాణ, ఏపీ, గోవా, ఒడిశా ఆర్టీసీ అధికారులతో పాటు పలు బస్‌బాడీ నిర్మాణ సంస్థల ప్రతిని ధులు, టీఎస్‌ఆర్టీసీ ఈడీలు నాగరాజు, వేణు, రవీందర్‌ ఇందులో పాల్గొన్నారు.

నాలుగు రకాలుగా వర్గీకరించి..
సిటీ బస్సులను టైప్‌–1గా, పట్టణ ప్రాం తాల మధ్య తిరిగేవి టైప్‌–2గా, దూర ప్రాంతాల బస్సులను టైప్‌–3గా, విమానా శ్రయాలు, పాఠశాలలు, టూరిస్ట్‌ బస్సులను టైప్‌–4గా విభజించారు.
⇒  ఇక నాన్‌ డీలక్స్, సెమీ డీలక్స్, డీలక్స్, ఏసీ బస్సులుగా నాలుగు కేటగిరీలు ఉంటాయి.
తక్కువ, మధ్యస్థాయి, అధిక సీట్ల సామ ర్థ్యంగా విభజించారు.
  ఒక్కో టైప్, కేటగిరీని బట్టి.. బస్సుల తలుపుల సంఖ్య, కిటికీల వ్యాసం, వాటికి గార్డ్‌ రెయిల్స్, అత్యవసర మార్గాలను నిర్దేశించారు.
  సీట్ల సంఖ్య, ఒక్కో ప్రయాణికుడికి ఒక్కో సీటుగా ఉండాలా, ఇద్దరికి కలిపి ఒకటి ఉండాలా, సీట్ల మధ్య ఖాళీ స్థలం.. వంటి అంశాలను ఒక్కో కేటగిరీకి ఒక్కో తరహాలో నిర్దేశించారు.
  మెట్ల ఎత్తు, వికలాంగులకు రిజర్వు చేయాల్సిన సీట్లు, నాన్‌ ఏసీ బస్సుల్లో ఫ్యాన్లు, గమ్యస్థానాల పేర్లు సూచించే బోర్డులు, ఏయే కేటగిరీల బస్సుల్లో వాటర్‌ బాటిళ్లు, న్యూస్‌పేపర్‌ కవర్లు, ఫుడ్‌ ట్రేలు ఉండాలన్న నిబంధనలనూ విధించారు.

Advertisement
Advertisement