డాక్టర్ల రాజీనామాస్త్రం! | Sakshi
Sakshi News home page

డాక్టర్ల రాజీనామాస్త్రం!

Published Wed, Jun 25 2014 11:34 PM

డాక్టర్ల రాజీనామాస్త్రం!

- జూలై 1న సామాహిక రాజీనామాలు
- పన్నెండువేల మంది ప్రభుత్వ వైద్యుల హెచ్చరిక
- సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చనందునే..
సాక్షి, ముంబై:
ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సార్వజనిక  ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్యులందరూ సామూహికంగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ లో పన్నెండు వేల మంది వైద్యులు పనిచేస్తున్నారు.
 
జూలై ఒకటో తేదీన ‘డాక్టర్స్ డే’ పురస్కరించుకొని సామూహికంగా తమ పదవులకు రాజీనామాలు చేయాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర స్టేట్ గెజిటెడ్ మెడికల్ అధికారుల సంఘం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వైద్యాధికారులకు పదోన్నతులు, వేతనాల పెంపు, పదవీ విరమణ కాలం పెంపు తదితర పది కీలక డిమాండ్లను సీఎం చవాన్ ముందు ఉంచాం. అందుకు ఆయన పదిరోజుల్లో కొన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
 
కాని 20 రోజులు గడిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. దీంతో సామూహికంగా రాజీనామాలు చేయాలని నిర్ణయానికి వచ్చామ’ని ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం మాట తప్పడంతోనే సామూహిక రాజీనామాలుచేసి ఆందోళనకు దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు గెజిటెడ్ మెడికల్ అధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రాజేశ్ గైక్వాడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ రక్షమ్‌వార్ వెల్లడించారు.
 
తమ ఆందోళనను చవాన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ముంబైలోని ఆజాద్‌మైదాన్‌లో తామిరువురం ఆమరణ నిరాహార  దీక్ష చేస్తామన్నారు. ఒకవేళ అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. వైద్యులు తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతాయని,  దీంతో వైద్యం అందక అనేక మంది పేద ప్రజలు ఇబ్బందులు పడడం ఖాయ మని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement