'పెద్దల’ లాటరీ నేడే | Sakshi
Sakshi News home page

'పెద్దల’ లాటరీ నేడే

Published Wed, May 28 2014 12:10 AM

'పెద్దల’ లాటరీ నేడే

ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర రాజ్యసభ సభ్యుల పంపకం
సభ చైర్మన్, సెక్రటరీ జనరల్ సమక్షంలో లాటరీ
{పస్తుతం తెలంగాణ నుంచి 9, ఆంధ్రా నుంచి 8 మంది ప్రాతినిధ్యం
లాటరీ ద్వారా తెలంగాణకు 7, సీమాంధ్రకు 11 మంది కేటాయింపు
అటు వారు ఇటు...ఇటు వారటు వెళితే ఇబ్బందే

 
 
హైదరాబాద్: రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యుల విభజన ఆసక్తికరంగా మారింది. బుధవారం ఉదయం 11.30 గంటలకు పార్లమెంట్ ఆవరణలో లాటరీ ద్వారా రాజ్యసభ సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ కె.షరీఫ్ నుంచి ఆయా ఎంపీలందరికీ సమాచారం వచ్చింది. దీంతో ఆయా ఎంపీలంతా ఢిల్లీకి పయనమయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో 18 మంది రాజ్యసభ సభ్యులుండగా వీరిలో 11 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, ఏడుగురిని తెలంగాణకు కేటాయించనున్నారు. 18 మంది ఎంపీలకుగాను నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణించడంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన 17 మందిలో 9 మంది తెలంగాణకు చెందిన వారుండగా, 8 మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ వారు కావడంతో లాటరీ అనివార్యమైంది.

రిటైర్‌మెంట్ ప్రాతిపదికన లాటరీ: రాజ్యసభలో రెండేళ్లకోసారి మూడోవంతు సభ్యుల పదవీకాలం ముగియడం, వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవడం సాధారణ ప్రక్రియ. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో 2016లో ఆరుగురు, 2018లో మరో ఆరుగురు, 2020లో ఇంకో ఆరుగురు సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే లాటరీ ప్రక్రియ కూడా ఒకేసారి 18 మంది ఎంపీలను కలిపి కాకుండా రిటైర్‌మెంట్ వారీగానే నిర్వహించనున్నారు. అందులో భాగంగా తెలంగాణకు 2016లో ఇద్దరిని, 2018లో ముగ్గురిని, 2020లో ఇద్దరు ఎంపీల చొప్పున కేటాయించాల్సి ఉంటుంది.

2016లో లాటరీ అక్కర్లేదు: ఈ లెక్కన చూస్తే 2016లో లాటరీ పద్ధతి అనుసరించాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే ఈ దఫా పదవీకాలం ముగియనున్న ఆరుగురు ఎంపీల్లో ఇద్దరు మాత్రమే (గుండు సుధారాణి, వి.హనుమంతరావు) తెలంగాణకు చెందిన వారు. మిగిలిన నలుగురు (సుజనాచౌదరి, జైరాం రమేశ్, జేడీ శీలం, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి) సీమాంధ్రకు చెందిన వారు. నేదురుమల్లి మరణించడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. జైరాం రమేశ్ కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ... తాను ఇకపై సీమాంధ్ర ఎంపీగానే ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు ఎంపీలు ఏకాభిప్రాయానికి వస్తే లాటరీ వేయాల్సిన అవసరం ఉండదు.

ఇబ్బంది అంతా ఇక్కడే...: 2018, 2020ల్లో పదవీకాలం ముగియనున్న ఎంపీలతోనే చిక్కుముడి ఏర్పడింది. ఎందుకంటే 2018లో పదవీకాలం ముగియనున్న వారిలో చిరంజీవి, సీఎం రమేశ్ మాత్రమే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారున్నారు. మిగిలిన వారిలో రేణుకాచౌదరి, దేవేందర్‌గౌడ్, రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలంగాణ వారు. ఇక్కడ ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు కన్పించడం లేదు. 2020లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఎదురుకానుంది. అప్పుడు పదవీకాలం ముగియనున్నవారిలో ఎంఏ ఖాన్, గరికపాటి రామ్మోహన్‌రావు, కె.కేశవరావు తెలంగాణకు, కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, సీతామహాలక్ష్మీ సీమాంధ్రకు చెందినవారు. అయితే ఇందులోంచి నలుగురిని సీమాంధ్రకు, ఇద్దరిని తెలంగాణకు కేటాయించాల్సి రావడంతో లాటరీ అనివార్యం కానుంది. వీరిలో గరికపాటి మూలాలు సీమాంధ్ర ప్రాంతానికి చెందినవే అయినప్పటికీ ఆయన మాత్రం తెలంగాణకే ప్రాతినిధ్యం వహిస్తానని చెబుతున్నారు.

 కుడి ఎడమైతే.. ఇరకాటమే: లాటరీలో ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి వెళితే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా కుడి ఎడమైతే పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఉదాహరణకు టీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవరావు లాటరీలో సీమాంధ్రకు కేటాయిస్తే ఇబ్బందికరంగా మారుతుంది. రాజ్యసభ సభ్యుడు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే తన ఎంపీ నిధులను ఆ రాష్ట్రానికే ఖర్చు చేయాల్సి ఉంది.  రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర నేతల మధ్య స్పష్టమైన విభజన ఏర్పడిన నేపథ్యంలో ఏ రాష్ట్ర ఎంపీలు ఆ రాష్ట్రంలో ఉంటేనే మేలని, అటు ఇటుగా మారితే అన్నీ ఇబ్బందులేనని నేతలు అభిప్రాయపడుతున్నారు.

 ప్రత్యామ్నాయమేమిటి?

లాటరీ ద్వారా అంతా తారుమారయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయంపై ఎంపీలు దృష్టి సారించారు. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఎంపీలు ఏకాభిప్రాయానికి వస్తే లాటరీ బాధ తప్పుతుంది. ఈ విషయంలో తెలంగాణ ఎంపీలపైనే ప్రధాన బాధ్యత ఉంది. ఎందుకంటే 9 మంది తెలంగాణ ఎంపీల్లో తప్పనిసరిగా ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాల్సి ఉన్నందున వీరిలో ఎవరైనా ఇద్దరు ముందుకొస్తే సమస్య పరిష్కారం తేలికవుతుంది. అందులో భాగంగా సీమాంధ్ర మూలాలున్న రేణుకాచౌదరి, గరికపాటి రామ్మోహన్‌రావు సీమాంధ్రకు వెళితే బాగుంటుందని ఇతర ఎంపీలు ప్రతిపాదిస్తున్నారు. లాటరీ తీసే ముందు ఆయా ఎంపీలు ఒక అవగాహనకు వస్తే సరేసరి. లేదంటే లాటరీ వేయడం అనివార్యం కానుంది.
 
 

Advertisement
Advertisement