నా భార్య తప్పుకోవాల్సిందే!: అమరిందర్ సింగ్ | Sakshi
Sakshi News home page

నా భార్య తప్పుకోవాల్సిందే!: అమరిందర్ సింగ్

Published Sun, Dec 18 2016 4:46 PM

నా భార్య తప్పుకోవాల్సిందే!: అమరిందర్ సింగ్

అమృత్‌సర్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టికెట్ (వన్ ఫ్యామిలీ-వన్ టికెట్) ఇస్తామని పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ చీఫ్ అమరిందర్‌ సింగ్ స్పష్టంచేశారు. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను అసలు మార్చే ఉద్దేశమే లేదని, అలా చేస్తే పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఏది ఏమైనా ఈ రెండు ఫార్ములాలను మార్చేది లేదన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన తర్వాత వచ్చే వారం అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. వన్ ఫ్యామిలీ-వన్ టికెట్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తన భార్య, పాటియాలా ఎమ్మెల్యే ప్రిణీత్ కౌర్ కు టికెట్ ఇవ్వలేదని (తన కోసం ఎలక్షన్ నుంచి తప్పుకుంటున్నట్లు) చెప్పారు. రాష్ట్రంలో మరికొందరు నేతల ఇళ్లల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఇతర నియోజకవర్గాల నుంచి బరిలో దింపితే ప్రతికూల ఫలితాలు వస్తాయని, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇది తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని కెప్టెన్ అమరిందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే జనరల్ సీట్లను మాత్రమే వారికే ఇస్తామని, 34 శాతం ఉన్న రిజర్వ్‌డ్ స్థానాల్లో కొత్త వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం గానీ, నియోజకవర్గాల మార్పు చేయడం తదితర అంశాలు ఉన్నాయని తెలిపారు. ఇదివరకే 61 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించామని, ఇక మిగిలిన 56 సీట్లను పార్టీ ఎలక్షన్ కమిటీ భేటీ అనంతరం వెల్లడిస్తామన్నారు. ఈ సారి ఎలాగైనా అకాలీదళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పార్టీని గెలిపించాలని వ్యూహాలు రచిస్తున్నారు.

Advertisement
Advertisement