డాక్టర్లపదవీ విరమణ 65 ఏళ్లకు పెంపు | Sakshi
Sakshi News home page

డాక్టర్లపదవీ విరమణ 65 ఏళ్లకు పెంపు

Published Wed, Jun 1 2016 1:32 AM

డాక్టర్లపదవీ విరమణ 65 ఏళ్లకు పెంపు

న్యూఢిల్లీ: కేంద్ర వైద్య సేవల్లో ఉన్న డాక్టర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా మంగళవారం స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 4వేల మంది డాక్టర్లకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వ సేవల్లో ఉన్న డాక్టర్ల రిటైర్మెంట్ వయసును 65 పెంచాలని నిర్ణయించాం. మే 31, 2016 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.

ఈ నిర్ణయం కారణంగా.. తమ దగ్గరున్న అనుభవజ్ఞులైన వైద్యుల నాణ్యమైన సేవలను మరికొంత కాలం దేశానికి అందించే అవకాశం దక్కిందని మరో ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రెండేళ్ల వేడుకల సందర్భంగా.. మే 26న సహరాన్‌పూర్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. వారం రోజుల్లో కేంద్ర కేబినెట్ దీనిపై ప్రకటన చేస్తుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లుగానే ఈ నిర్ణయం వెలువడినట్లు జేపీ నడ్డా తెలిపారు.

 ఉగ్రవాదంపై పోరాటం కోసం దేశాలను ఏకం చేయాలి: మోదీ
 ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాదంపై పోరులో వివిధ దేశాలను ఏకం చేయాల్సిన బాధ్యతను దౌత్యవేత్తలే తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఢిల్లీలో ఐదురోజులుగా జరుగుతున్న హెడ్స్ ఆఫ్ డిప్లొమాట్స్ సదస్సులో చివరి రోజైన మంగళవారం ఆయన హాజరయ్యారు.  ‘దౌత్యపరమైన విషయాల్లో మనం కొత్త శకంలోకి అడుగుపెట్టాం. ఇకపై భారత ఆకాంక్షలను ప్రపంచవ్యాప్తం చేయాలి’ అని పేర్కొన్నారు. దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయటంలో దౌత్యవేత్తల పాత్ర కీలకమన్నారు. అంతర్జాతీయ సౌరశక్తి కూటమి ప్రపంచంలోని మెజారిటీ దేశాలకు చాలా అవసరమని దీనికి మనమే నాయకత్వం వహించాలని చెప్పారు. విదేశాంగ విధానం, ప్రభుత్వ కార్యక్రమాలు, వివిధ దేశాలతో భారత ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై ఈ సదస్సులో చర్చించారు.

Advertisement
Advertisement