హెచ్‌సీయూలో మరో వివాదం | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూలో మరో వివాదం

Published Thu, Nov 9 2017 5:07 AM

another controversy in UOH : 10 students suspended - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ(హెచ్‌సీయూ)లో మరో వివాదం రాజుకుంది. హాస్టల్‌ వార్డెన్‌తో విద్యార్థుల వాగ్వాదాన్ని సాకుగా చూపి వీసీ అప్పారావు 10 మంది విద్యార్థులను అకడమిక్స్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో ఇద్దరు అమ్మాయిలు, ఓ దళిత స్టూడెంట్, మరో ఏడుగురు విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంగా తయారైంది.

అసలేమైందంటే..?
ఈ నెల 3న రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీల పేరుతో డిప్యూటీ వార్డెన్‌ వినీత్‌ సీపీ నాయర్‌ బాయ్స్‌ హాస్టల్‌కు వచ్చారు. ఆ సమయంలో హాస్టల్‌లోని తన మిత్రుడి వద్ద పుస్తకం కోసం వచ్చిన అమ్మాయిని వార్డెన్‌ నిలదీశారు. దీంతో ఆయన వైఖరిని హాస్టల్‌ విద్యార్థులు తప్పు పట్టారు. విద్యార్థులు పుస్తకాలు ఇచ్చిపుచ్చుకోవడం సహజమేనని, దానికి అభ్యంతరమేంటని నిలదీయడంతో వాగ్వాదం జరిగింది. దీన్ని సాకుగా చూపి, అక్కడ ఎలాంటి ఘర్షణ జరగకుండానే దీనిపై వీసీ అప్పారావు ఈ నెల 4న ఓ స్వతంత్ర కమిటీ వేశారు. 6న విద్యార్థులను కమిటీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. విద్యార్థులు కమిటీ ఎదుట జరిగిన వాస్తవాన్ని వివరించారు. అక్కడ ఎలాంటి భౌతిక దాడులు జరగలేదని ఎంత చెప్పినా యాజమాన్యం పట్టించుకోలేదు. వామపక్ష రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తోన్న విద్యార్థులను గుర్తించి ముగ్గురిపై రెండేళ్లు, మరో ఏడుగురిపై ఆరు నెలలపాటు అకడమిక్‌ సస్పెన్షన్‌ విధించింది. నిజానికి హాస్టల్‌లో ఏ ఘటన జరిగినా ప్రొక్టోరల్‌ బోర్డ్‌ పరిశీలించి విచారించాల్సి ఉంటుంది. కానీ అదేదీ లేకుండా వర్సిటీ యాజమాన్యం.. ఏకపక్షంగా వ్యవహరించిందని, తమపై కక్ష సాధింపునకు పాల్పడిందని సస్పెన్షన్‌కు గురైన యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు సాయికుమార్‌ యామర్తి ‘సాక్షి’కి తెలిపారు. సస్పెన్షన్‌కి గురైన వారిలో కేరళ ఎస్‌ఎఫ్‌ఐ ప్రెసిడెంట్‌ అర్పిత్, లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యులు తినంజలి, త్రిపురకు చెందిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు కేశబన్, హైదరాబాద్‌ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు సాహిత్, తెలంగాణ బీఎస్‌ఎఫ్‌ నాయకుడు వెంకటేశ్, బెంగాల్‌కు చెందిన శుభం గోస్వామి, ప్రత్యూష్, అథిర, సాగ్నిక్‌లు ఉన్నారు. ఇందులో ప్రత్యూష్, అథిర, సాగ్నిక్‌లను రెండేళ్లు మిగిలిన వారిని ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేశారు. ఆరు నెలల పాటు పాటు సస్పెండ్‌ అయినవారిని హస్టల్‌ నుంచి శాశ్వతంగా సస్పెండ్‌ చేయడం గమనార్హం.

వారిపైనే వేటు వేయడంలో ఉద్దేశం..?
హాస్టల్‌ వద్ద వాగ్వివాదం జరిగిన సమయంలో 200 మంది విద్యార్థులుంటే కేవలం వామపక్ష విద్యార్థి సంఘ నాయకులపైనే సస్పెన్షన్‌ వేటు వేయడంలో ఉద్దేశం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. రోహి త్‌ వేముల మరణం తర్వాత కూడా వర్సిటీలో వీసీ అప్పారావు ఆగడాలకు అంతే లేకుండా పోతోందని విద్యార్థులు మండిపడుతున్నారు. విద్యార్థుల సస్పెన్షన్‌పై పోరా ట రూపాన్ని నిర్ధారించేందుకు అన్ని విద్యార్థి సంఘాలు వర్సిటీలో సమావేశమయ్యాయి. 

Advertisement
Advertisement