సాయానికి కట్టుబడి ఉన్నాం.. | Sakshi
Sakshi News home page

సాయానికి కట్టుబడి ఉన్నాం..

Published Fri, Sep 9 2016 1:49 AM

సాయానికి కట్టుబడి ఉన్నాం.. - Sakshi

వెబ్‌సైట్‌లో అరుణ్ జైట్లీ ప్రకటన పూర్తి వివరాలు
 
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన పూర్తి వివరాలతో కూడిన మూడు పేజీల నివేదికను ఆర్థిక శాఖ గురువారం కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ (పీఐబీ)లో పొందుపరిచింది. 11 పాయింట్లతో కూడిన ఈ నివేదిక సారాంశాన్నే అరుణ్‌జైట్లీ బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో వివరించారు. పూర్తి వివరాలు గురువారం వెబ్‌సైట్‌లో పెడతామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇప్పటివరకు ఎంత సాయం చేసిందీ, అలాగే చేయబోయే సాయం తదితర వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. వివరాలు పాయింట్ల వారీగా..
 

1. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేసేందుకు కట్టుబడి ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 14వ ఆర్థిక సంఘం ద్వారా రెవెన్యూ లోటు భర్తీ, విభజన రోజున ప్రధానమంత్రి చేసిన హామీలు, నీతిఆయోగ్  సిఫారసులు.. ఈ నాలుగు రూపాల్లో ఏపీకి సాయం దక్కుతుంది.
2. పైన ప్రస్తావించిన హామీలను నాలుగు అంశాలుగా వర్గీకరించాం..

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం
ఎ) విభజన తరువాత నూతన రాష్ట్రాలకు రెవెన్యూ వనరులపై 14వ ఆర్థిక సంఘం ప్రత్యే క అవార్డులు ప్రకటించాలని విభజన చట్టంలోని సెక్షన్ 46 చెబుతోంది. అలాగే ఏపీలోని వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాం తాలకు తగినన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పింది. బి) పోలవరం ప్రాజెక్టుకు సెక్షన్ 90 ద్వారా జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారు.
 సి) మౌలికవసతుల ఏర్పాటు విషయాన్ని షెడ్యూలు 13లో పొందుపరిచారు.
డి) పారిశ్రామిక ప్రగతికి వీలుగా పన్ను ప్రోత్సాహకాలు, తగిన ఆర్థిక చర్యలను సెక్షన్ 94 నిర్దేశించింది. అలాగే వెనకబడిన ప్రాంతాలకు భౌతిక, సామాజిక మౌలిక వసతుల ఏర్పాటులో సహాయాన్ని నిర్దేశించింది. అలాగే నూతన రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, మండలి తదితర మౌలిక వసతుల ఏర్పాటుకు సహాయం చేయాలని సూచించింది.
 

20.02.2014న నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటన
విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగిన రోజు 20.02.2014న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఏపీకి ప్రత్యేక హోదాను ఐదేళ్ల పాటు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. అలాగే 2014-15లో రెవెన్యూలోటును కేంద్రం భర్తీ చేస్తుందని చెప్పారు.
పద్నాలుగో ఆర్థిక సంఘం: పద్నాలుగో ఆర్థిక సంఘం 2019-20 మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను తేల్చింది. ఈ సంఘం ప్రత్యేక హోదా కేటగిరీ రాష్ట్రాలకు, సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదు. కేంద్ర పన్నుల వాటా నుంచి 42 శాతం నిధులను రాష్ట్రాలకు కేటాయిస్తూ సిఫారసు చేసింది. ఈ కేటాయింపుల వల్ల రెవెన్యూ లోటు భర్తీ కానిపక్షంలో ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా రెవెన్యూ లోటు గ్రాంటును కూడా కేటాయించింది. అలాంటి రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ లెక్కన ఐదేళ్లలో ఏపీకి రూ. 22,113 కోట్లు చెల్లించాల్సి ఉంది.
నీతి ఆయోగ్ సిఫారసులు: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ పనగారియా ఆంధ్రప్రదేశ్‌కు పునర్వ్యవస్థీకరణ చట్టం పరిధిలో చేయాల్సిన సాయంపై అధ్యయనం చేశారు. ఈమేరకు కొన్ని సిఫారసులు చేశారు.

రాష్ట్రానికి కేంద్రం చేయబోయేది
3. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014-15లో రెవెన్యూ లోటును ప్రామాణికమైన ఖర్చును పరిగణనలోకి తీసుకుని కేంద్రం చెల్లిస్తుంది. పెన్షన్ స్కీములకు సంబంధించిన లెక్కలను సర్దుబాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటాం. రెవెన్యూ లోటు కింద ఇప్పటికే రూ 3,979 కోట్లు చెల్లించాం. మిగిలినది వార్షిక వాయిదాల కింద చెల్లిస్తాం.
 ఏపీ నూతన రాజధాని కోసం రూ.2,500 కోట్లు ఇచ్చాం. మిగిలిన రూ.1,000 కోట్లను కూడా చెల్లిస్తాం.
 వెనకబడిన ప్రాంతాలకు ఇప్పటికే రూ.1,050 కోట్లు ఇచ్చాం. రానున్న సంవత్సరాల్లో మరో రూ.1,050 కోట్లు ఇస్తాం
4. పోలవరం ప్రాజెక్టుకు 2009లో రూ. 10,151 కోట్ల అంచనాతో ప్రణాళికా సంఘం ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. తదుపరి 2011లో రూ. 16,010 కోట్ల అంచనా వ్యయానికి అనుమతి లభించింది. ఇందులో రూ. 2,868 కోట్ల మేర విద్యుత్, తాగునీటి ప్రాజెక్టుల కాంపొనెంట్ కూడా ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొందేనాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మి స్తూ ఉంది. 31.03.2014 నాటికి రూ.5,135 కోట్లు వెచ్చించింది. ఇందులో ఏఐబీపీ కింద కేంద్రం రూ.562 కోట్లు సాయం చేసింది.
 ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇకపై ఇలా సాయపడుతుంది. విద్యుత్, తాగునీరు అంశాలు మినహాయించి సాగునీటి అంశానికి సంబంధించి 01.01.2014 తర్వాత అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. తమ రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టును తామే అమలు చేస్తే సముచితంగా ఉంటుందని ఏపీ విజ్ఞప్తి చేయగా.. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సిఫారసును దృష్టిలో పెట్టుకుని కేంద్రం అందుకు సమ్మతించింది. కేంద్రం తరఫున రాష్ట్రమే ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది.
5. కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఏపీకి ఆర్థిక ప్రోత్సాహకాలను ఇన్వెస్ట్‌మెంట్ అలవెన్స్, డిప్రిసియేషన్ అలవెన్స్ రూపంలో ప్రకటించింది. అర్హత కలిగిన వెనకబడిన ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయగానే ఇవి అమలులోకి వస్తాయి.
6.  విద్యాసంస్థలు, ఇతర సంస్థల విషయంలో..
పెట్రోలియం వర్సిటీ ఇదివరకే ఏర్పాటు చేశాం.
ఐఐటీ ఇప్పటికే తాత్కాలిక వసతిలో కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. ప్రధాన క్యాంపస్ నిర్మాణంలో ఉంది.
ఎన్‌ఐటీ సెప్టెంబర్ 2015 నుంచి నడుస్తోంది. ప్రధాన క్యాంపస్ నిర్మాణంలో ఉంది ఐఐఐటీ కర్నూలులో తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తోంది. ప్రధాన క్యాంపస్ నిర్మాణంలో ఉంది.
కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అనంతపురంలో స్థల ఎంపిక జరిగింది.
ఐఐఐఎస్‌ఈఆర్ సంస్థను తిరుపతిలో ఏర్పాటు చేశాం.
విశాఖలో ఐఐఎం నెలకొల్పాం.
గుంటూరులో ఎయిమ్స్ నిర్మాణానికి ఆమోదం ఇచ్చాం. అవసరమైన స్థలాన్ని కూడా తీసుకున్నాం.
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. స్థలాన్ని తీసుకున్నాం.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. స్థలాన్ని తీసుకున్నాం.


7 (ఎ). నిర్వహణ యోగ్యత అనే షరతుకు లోబడి దుగరాజపట్నం పోర్టును పీపీపీ విధానంలో ఏర్పాటుచే సేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. బి). ఏపీలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలపై ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన రీతిలో అధ్యయనం జరుగుతోంది.
 సి) ఎయిర్‌పోర్టుల విషయానికొస్తే.. విశాఖలో ఇదివరకే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమయ్యాయి. మరింత విస్తరణకు వీలుగా భోగాపురంలో స్థలాన్ని గుర్తించాం. రాష్ట్ర ప్రభుత్వం దానిని సేకరించి ఎయిర్ ఇండియా అథారిటీకి ఇవ్వాల్సి ఉంది. సాంకేతిక, ఆర్థిక యోగ్యత నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పంపించాల్సి ఉంది.
విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత టర్మినల్‌ను అభివృద్ధి పరచాల్సి ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 698 ఎకరాలను సేకరించాల్సి ఉంది.
 తిరుపతిలో నూతన టర్మినల్‌ను ప్రధానమంత్రి 22.10.2015న ప్రారంభించారు. విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.
డి). ఏపీలో జాతీయ రహదారుల ఏర్పాటుకు జాతీయ ర హదారుల సంస్థ పలు చర్యలు తీసుకుంది. అలాగే రైల్వే శాఖ అమరావతి-హైదరాబాద్ మధ్య ర్యాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీకి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తోంది. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు మార్గ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను కేంద్రం క్రియాశీలకంగా పరిశీలిస్తోంది.
8. పద్నాలుగో ఆర్థిక సంఘం అవార్డు 01.04.2015 నుంచి అమల్లోకి వచ్చింది. పన్నుల వాటాలో పెరిగిన కేటాయింపులను ఏపీకి చెల్లిస్తూ వస్తున్నాం. 2014-15తో పోలిస్తే 2015-16లో రూ.7,787 కోట్లు.. అంటే 55 శాతం పెరిగాయి. అలాగే రెవెన్యూ లోటు కోసం ఈ సంఘం సిఫారసు చేసిన రీతిలో ఏటా ఏపీకి చెల్లిస్తూ వచ్చాం. ఇందులో బకాయిలు ఏమీ లేవు.
9. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమ లు చేస్తూ వస్తోంది. ఇకపై అమలు చేస్తుంది.
10. నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ 20.02.2014న చేసిన ప్రకటనలో 6 అంశాలు ఉన్నాయి. ఆ ఆరింటిలో ఐదు అంశాల విషయంలో ఎలాంటి సమస్యా లేదు. అయితే మొదటి అంశంగా ఉన్న స్పెషల్ స్టేటస్ విషయంలో నాటి ప్రకటనకు, ఆ తరువాత వెలువడిన పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసులకు మధ్య సంఘర్షణ తలెత్తింది. సంఘం సిఫారసుల నివేదికలోని 17వ పేజీలోని పేరాలు 2.29, 2.30లు ఏం చెబుతున్నాయంటే..
 ‘‘మా నిబంధనలు, సిఫారసుల నిర్ధారణలో మేం ప్రత్యేక హోదా రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని చూపలేదు. రాష్ట్రాల వనరుల విషయంలో అవరోధాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరుగ ఉన్నాయి. ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంతాలు గల రాష్ట్రాలు విభిన్న పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అతి తక్కువ ఆర్థిక వనరులు, మారుమూలగా ఉండడం, అంతర్జాతీయ సరిహద్దులు ఉండడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్నాం. పన్నుల కేటాయింపు ద్వారా ప్రతి రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. పన్నుల కేటాయింపుల ద్వారా రెవెన్యూ లోటు భర్తీ కాని పక్షంలో అదనంగా రెవెన్యూ లోటు గ్రాంట్లను సిఫారసు చేశాం. ఆయా రాష్ట్రాల్లో అసమానత్వం అనేది ఆయా రాష్ట్రాల విధాన పరిధిలోనిది. పన్నుల కేటాయింపులు ఆయా రాష్ట్రాల్లో అసమానత్వాన్ని మెరుగైన రీతిలో పరిష్కరించుకునేందుకు దోహదం చేస్తాయి’’
 ఆ రకంగా 14వ ఆర్థిక సంఘం సిఫారసులు ఉండడంతో ప్రత్యేక హోదా రాష్ట్రాలు అనే తరగతి ఉండదు. అయినప్పటికీ కేంద్రం ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక సాయం చేసేందుకు అంగీకరించింది. అదనంగా కేంద్ర వాటా పొందేలా ఈ సాయం ఉంటుంది. నాటి ప్రధాని ప్రకటన కూడా సాయాన్ని సూచించేదే. ఎక్స్‌టెర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల రూపంలో ఈ సాయం ఉంటుంది.
 11. ఆ రకంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, పధ్నాలుగో ఆర్థిక సంఘం, నాటి ప్రధాని ప్రకటన మేరకు హామీలన్నింటి కీ పరిష్కారం చూపింది.

Advertisement
Advertisement