Sakshi News home page

యశ‍్వంత్‌-జైట్లీ మాటల యుద్ధం

Published Fri, Sep 29 2017 11:36 AM

Arun Jaitley’s response to Yashwant Sinha’s attack: ‘Job applicant at 80’

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ మాజీ సీనియర్‌ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా  వ్యాఖ్యలకు  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణుజైట్లీ ఘాటుగా స్పందించారు.   భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోందన్న యశ్వంత్‌ సిన్హా ఆరోపణలపై స్పందించిన జైట్లీ సిన్హాకు ఈ వయసులో పనిలేకుండా పోయిందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 80 సంవత్సరాల  వయసులో ఇపుడు ఆయన ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నట్టుందంటూ  కౌంటర్‌ ఇచ్చారు. 

"ఇండియా ఎట్ 70 మోడీ ఎట్ 3.5: కాప్చరింగ్ ఇండియాస్ ట్రాన్స్ ఫార్మేషన్ అండర్ నరేంద్ర మోదీ"   వివేక్ దేబ్రాయ్, అశోక్ మాలిక్ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా జైట్లీ ఈ  వ్యాఖ్యలు చేశారు.    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1998 నుంచి 2002 మధ్యకాలంలో యశ్వంత్ ఆర్థిక మంత్రిగా  ఉన‍్నప్పటి ఎన్‌పీఏల సంగతి ఏమిటని ప్రశ్నించారు.   అలాగే యుపిఎ పాలనలో 9-10 శాతంగా నమోదైన  ద్రవ్యోల్బణాన్ని  జైట్లీ ఎత్తి చూపారు.  వృద్ధి రేటు  అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందనీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మద్దతు ఉందా లేక  అది మన వృద్ధికి అడ్డుపడుతోందా? లాంటి కీలక అంశాలను పరగణనలోకి తీసుకోవాలన్నారు.

2003-08 కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకనుగుణంగా వృద్ధి నమోదు చేసిందనీ, కానీ  అది నెమ్మదించిన సందర్భంలోముఖ్యంగా  నరేంద్ర మోదీ హయాంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచామని జైట్లీ చెప్పారు. పెట్టుబడుల విషయంలో, ప్రభుత్వరంగ సంస్థలతో పాటు , కేంద్రం కూడా   చర్యలకు దిగిందనీ,  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బలంగా ఉన్నాయని అన్నారు. యుపిఎకు విరుద్ధంగా బ్యాంక్  మొండిబకాయిల  శుద్ధి చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉందని అరుజ్‌ జైట్లీ తెలిపారు. వృద్ధి రేటు  అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందనీ, గడచిన త్రైమాసికంలో  వృద్ధి రేటు తగ్గడానికి కారణాలు ప్రతి ఒక్కరికీ తెలుసునని, ఇది కేవలం తాత్కాలికమేనని అన్నారు. ఈ అంశంలో విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని  పేర్కొన్నారు.

మరోవైపు జైట్లీ వ్యాఖ్యలపై యశ్వంత్‌ సిన్హా కూడా కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు. బీజేపీ సీనియర్‌ నేత వాజ్‌పేయ్‌  సూచనలకు భిన‍్నంగా  80 ఏళ్ల వయసులో ఉద్యోగార్థి అంటూ అరుణ్ జైట్లీ తనపై వ్యక్తిగత దూషణలకు దిగడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఐఏఎస్‌లో ఉండగానే రాజకీయాల్లోకి వచ్చానని ఒకవేళ తాను  జాబ్ కోసం అప్లై చేసుకుని ఉంటే.. జైట్లీ ఈ పొజిటిషన్‌లో ఉండేవారు కాదంటూ జైట్లీ కామెంట్స్‌ను తిప్పికొట్టారు. తన హయాంలో ద్రవ్యోల్బణం  పూర్తి నియంత్రణలో ఉందని వివరణ ఇచ్చారు. అలాగే పనామా కేసులో అడ్డంగా బుక్కయినందుకు పాకిస్థాన్‌లో ప్రధానినే దించేశారని, మరి ఇక్కడ పరిస్థితి ఏంటని  ప్రశ్నించారు.  డీమానిటైజేషన్‌ కారణంగా జైట్లీ ఎంత నల్లధనాన్ని వెలికి తీశారో వెల్లడి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కాగా దేశ ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేదని, ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతే.. దేశ పౌరుడిగా తన విధి నిర్వహణలో వైఫల్యం చెందినట్లేనంటూ  యశ్వంత్‌ సిన్హా బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement