'ప్రపంచంలో మాకే చెత్తగా చెల్లింపులు' | Sakshi
Sakshi News home page

'ప్రపంచంలో మాకే చెత్తగా చెల్లింపులు'

Published Wed, Jul 19 2017 4:09 PM

'ప్రపంచంలో మాకే చెత్తగా చెల్లింపులు'

చెన్నై: తమ రాష్ట్రంలోని రైతులంతా కూడా రుణమాఫీ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని తమిళనాడు ప్రభుత్వం తమ ఎమ్మెల్యేల జీత భత్యాలను మాత్రం ఒకేసారి రూ.50 వేలు పెంచేసింది. దీంతో ఇక నుంచి వారు నెలకు రూ.1.05లక్షల జీతం అందుకోనున్నారు. ఈ పెంపు కారణంగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు పొందుతున్న పెన్షన్‌ కూడా రూ.12,000 నుంచి రూ.20 వేలకు పెరిగింది.

ఇక తమ నియోజక వర్గాల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్న నిధుల మొత్తం కూడా రూ.2కోట్ల నుంచి రూ.2.6కోట్లకు పెరిగింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళని స్వామి బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా, మరోపక్క, తమ జీతభత్యాలు కూడా పెంచాలంటూ ఇప్పుడు ఎంపీలు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. సమాజ్‌వాది పార్టీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌, కాంగ్రెస్‌ ఎంపీ ఆనంద్‌శర్మ జీతభత్యాలు పెంచాలంటూ డిమాండ్‌ లేవనెత్తారు.

'ప్రపంచంలోని ఒక్క భారత పార్లమెంటే చెత్తగా ప్రతినిధులకు జీత భత్యాలు చెల్లిస్తోంది' అని ఆనంద్‌శర్మ వ్యాఖ్యానించారు. ఒక అగర్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ 'జర్నలిస్టులు, న్యాయ విభాగానికి చెందినవారు మరింత మంచి జీతభత్యాలు ఆపినట్లయితే మేం కూడా ఆపేస్తాం. మాకు చెల్లింపులు పెంచితే ఎందుకు సమస్య? న్యాయమూర్తులే అడుగుతున్నప్పుడు ఎంపీలుగా మేం ఎందుకు చెల్లింపులు పెంచాలని ఎందుకు అడగకూడదు? అని ప్రశ్నించారు. తాము కూడా 7వ వేతన చెల్లింపుల కమిషన్‌ పరిధిలోకి వస్తామని అందుకే డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement