6 లక్షల మద్యం బాటిళ్లను.. రోలర్‌తో తొక్కించిన మంత్రి | Sakshi
Sakshi News home page

6 లక్షల మద్యం బాటిళ్లను.. రోలర్‌తో తొక్కించిన మంత్రి

Published Sat, Aug 11 2018 9:48 AM

Assam government destroyes six lakh bottles of illegal liquor - Sakshi

గువాహటి (అసోం) : అక్రమంగా మద్యం తయారు చేస్తున్నవారిపై అసోం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అందరూ చూస్తుండగానే రూ.168.5 కోట్ల విలువ చేసే మద్యాన్ని అసోం ప్రభుత్వం రోడ్‌ రోలర్‌తో తొక్కించింది. ఏకంగా ఎక్సైజ్‌ మంత్రి పరిమళ్‌ శుక్లబైద్యనే శుక్రవారం రోడ్‌ రోలర్‌ నడిపి 6 లక్షల లిక్కర్‌ బాటిళ్లను ధ్వంసం చేశారు. 2016లో ఎక్సైజ్‌, పోలీసు అధికారులు దాడులు జరిపిన దాడుల్లో కర్బీ జిల్లాలోని కాట్‌కాటీలోని నాలుగు ప్రాంతాల్లో 14 ట్రక్కుల మద్యాన్ని పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తయారు చేసిన ఈ మద్యాన్ని గువాహటికి సరఫరా చేయడానికి సిద్దంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించి సీజ్‌ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 13 మందిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. 

కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో సీజ్‌ చేసిన మద్యాన్ని గోర్‌చుక్‌లో అందరూ చూస్తుండగానే రోడ్‌రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశామని మంత్రి పరిమళ్‌ శుక్లబైద్య తెలిపారు. అక్రమంగా మద్యాన్ని తయారు చేసి, సరఫరా చేయాలనుకున్న వారికి ఇదొక హెచ్చరిక వంటిదని పేర్కొన్నారు. అసోం ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 39, 085 లీటర్ల విదేశీ మద్యం ప్రతి రోజు అమ్ముడవుతోంది. అసోం వ్యాప్తంగా 1,448 లైసెన్స్‌లు కలిగిన వైన్‌ షాపులు ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement