'లైవ్'లో బాబా చెంప చెళ్లుమంది..

14 Sep, 2015 12:40 IST|Sakshi
'లైవ్'లో బాబా చెంప చెళ్లుమంది..

ముంబై : అదో న్యూస్ చానల్ కార్యాలయం... సీరియస్గా లైవ్ డిస్కషన్ జరుగుతోంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ... తాము ఎక్కడ ఉన్నామనే సంగతే మరిచిపోయి...చెంపలు వాయించుకున్న వీడియో... ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..  ముంబైలో ఆదివారం ఐబీఎన్ 7 చానెల్ ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చావేదికపై హిందూ మహాసభ ఆధ్యాత్మిక వేత్త ఓమ్జీ చెంపను ప్రముఖ జ్యోతిష్కురాలు దీపా శర్మ చెళ్లుమనిపించారు.

తర్వాత ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటున్న దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ఆధ్యాత్మిక విషయాలపై నిర్వహించిన చర్చకు అతిథులుగా విచ్చేసిన వీరిరువురు ఇలా గొడవపడ్డారు. ఇంతకీ వీళ్లిద్దరూ గొడవపడటానికి కారణం వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా గురించి. ఆమె వ్యవహార శైలి సందర్భంగా చర్చ పక్కదారి పట్టింది. అది కాస్త కార్యక్రమంలో పాల్గొన్న వక్తల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లటంతో రచ్చ మొదలైంది.


ఈ సందర్భంగా ఓమ్జీ...దీపా శర్మ పర్సనల్ లైఫ్ గురించి విమర్శలు చేయటంతో ...ఆగ్రహానికి గురైన ఆమె..ఓమ్జీ చెంప మీద ఒక్కటిచ్చుకున్నారు. దీంతో ఆయన కూడా దీపా శర్మపై చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కొట్లాటకు దిగటంతో యాంకర్ వారిని శాంతింపచేయాల్సి వచ్చింది. కాగా ఈ ఘటనను బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్కే సింగ్ ఖండించారు.