ఏ ఏటీఎంలలో డబ్బుందో ఇట్టే తెలుసుకోవచ్చు | Sakshi
Sakshi News home page

ఏ ఏటీఎంలలో డబ్బుందో ఇట్టే తెలుసుకోవచ్చు

Published Tue, Nov 15 2016 7:55 PM

ఏ ఏటీఎంలలో డబ్బుందో ఇట్టే తెలుసుకోవచ్చు - Sakshi

దేశంలో పెద్దనోట్ల రద్దుతో వచ్చిన కష్టాలు అందరికీ తెలిసిందే. రోజువారీ ఖర్చుల కోసం డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంలకు పరుగెడుతున్నాం. మనదాకా వచ్చేసరికి అవి మూతపడుతున్నాయి. మళ్లీ అక్కడి నుంచి మరో ఏటీఎంకు, అక్కడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అక్కడి నుంచి మరో చోటుకు...ఇలా రోజంతా తిరిగి రూపాయి కూడా రాలని పరిస్థితి ఎదురవుతోంది. ఈ కష్టాలను తీర్చేందుకు యాప్స్, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఫీచర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. మన సమీపంలో ఏటీఎంలు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటిలో ఎంత డబ్బుందో, వాటి ముందు ఎంత క్యూ ఉందో, ఆ డబ్బు మనదాకా వస్తుందా, లేదా? అన్న అంశాలను ఈ యాప్స్, ఈ ఫీచర్లు ఎప్పటికప్పుడు తెలియజేస్తాయి. ఏటీఎం ఖాళీ అవుతున్న విషయాన్ని, ఖాళీ అయిన విషయాన్ని కూడా మన స్మార్ట్‌ఫోన్‌కు వెంటవెంటనే తెలియజేస్తాయి. కాకపోతే జీపీఎస్‌ వ్యవస్థ ఆన్‌ చేసుకొని ఈ యాప్స్‌ లేదా ఫీచర్స్‌ను ఉపయోగించాలి. 
 
స్వరాజ్య ఏటీఎం లొకేటర్‌
రెండు కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో ఏటీఎంల పరిస్థితిని గుర్తించేందుకు స్వరాజ్య మాగజైన్‌ తన వెబ్‌సైట్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ ఏటీఎంల పరిస్థితిని మూడు రంగుల్లో సూచిస్తోంది. ఆకపచ్చ రంగులో ఏటీఎం కనిపిస్తే అందులో డబ్బు ఎక్కువగా ఉండి, తక్కువ క్యూ ఉందని అర్థం. జేగురు (అంబర్‌) రంగను సూచిస్తే డబ్బు ఎక్కువగానే ఉందిగానీ, క్యూ కూడా ఎక్కువగా ఉన్నట్లు అర్థం. ఇక ఎరుపు రంగు సూచిస్తే అందులో డబ్బులు ఖాళీ అయినట్లు అర్థం. చెన్నైలోని అకారా రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. ఈ లింక్‌కు యాక్సెస్‌ అయ్యే ముందు జీపీఎస్‌ వ్యవస్థను అన్‌చోసుకొని 'లొకేట్‌ మీ'పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అయితే.. ముందుగా యూజర్లు తమ తమ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలను సందర్శించి, వాటి పరిస్థితి చెబితేనే ఆ సమాచారం ఆధారంగా ఇందులో తెలుస్తుంది. 
 
సీఎంఎస్‌ ఏటీఎం ఫైండర్‌ 
నగదు నిర్వహణ, చెల్లింపులకు పరిష్కారాన్ని సూచించే సీఎంఎస్‌ కంపెనీ ఏటీఎం ఫైండర్‌ అనే కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. సీఎంఎస్‌ హోం పేజీలో మనది ఏ రాష్ట్రమో, ఏ నగరమో ముందుగా సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత మనమున్న లొకేషన్‌ను గుర్తించాలి. అప్పుడు మన ప్రాంతలో ఉన్న ఏటీఎంల వివరాలను అది మ్యాప్‌ ద్వారా చూపిస్తుంది. ఎందులో క్యాష్‌ ఉందో, ఎందులో లేదో కూడా తెలియజేస్తుంది. 
 
క్యాష్‌ నో క్యాష్‌
బెంగళూరుకు చెందిన టెకీలు మంజునాథ్‌ తల్వార్, అభిజీత్‌ ఖాసినీస్‌ సరికొత్త ఆన్‌లైన్‌ పోర్టల్‌తో మన కష్టాలను తీర్చేందుకు ముందుకొచ్చారు. సమీపంలోని బ్యాంక్, లేదా ఏటీఎం డబ్బులు పంపిణీ చేస్తుందా, లేదా అన్న సమాచారాన్ని 'క్యాష్‌ నో క్యాష్‌' పోర్టల్‌ వెంటవెంటనే యూజర్లకు సమాచారం ఇస్తుందని వారు చెప్పారు. ప్రస్తుతం క్రౌడ్‌ సోర్స్‌గా పనిచేస్తున్న ఈ పోర్టల్‌ మనముండే లొకేషన్‌ను అనుసరించి అక్కడున్న ఏటీఎంల వివరాలను తెలియజేస్తుందని వారు చెప్పారు. 
 
ఎప్పటికప్పుడు వినియోగదారుల సేవలో తాము నిమగ్నమై ఉన్నామని, ఆహారం, నిత్యావసర సరకుల నుంచి షాపింగ్‌ల వరకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని 'పేటీఎం' లాంటి సంస్థలు భారీ యాడ్స్‌తో మనముందుకొస్తున్న విషయం తెల్సిందే. ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఎన్నోమార్గాలున్నాయి గానీ ఆన్‌లైన్‌ గురించి కనీసావగాహన, ఆ సౌకర్యం లేని సామాన్యులకు ఏ సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుందో చూపాలి.

Advertisement
Advertisement