ఎన్డీయే సర్కారుపై దాడి | Sakshi
Sakshi News home page

ఎన్డీయే సర్కారుపై దాడి

Published Tue, Jan 26 2016 2:01 AM

ఎన్డీయే సర్కారుపై దాడి - Sakshi

అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ ఫైర్  ప్రణబ్‌తో భేటీ.. సుప్రీంలో పిటిషన్..
 
 న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ... కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ముప్పేట దాడి ప్రారంభించింది. రాష్ట్రపతి పాలన అన్యాయమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతోపాటు అటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనీ ఆశ్రయించింది. దీనితోపాటు ఈ అంశంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తమతో కలసి రావాలని బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలను కలసి కోరుతామని వెల్లడించింది. సోమవారం కాంగ్రెస్ నేతలు ఆజాద్, కపిల్ సిబల్ తదితరులతో కూడిన బృందం రాష్ట్రపతిని  కలసి ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అనంతరం ఆజాద్ విలేకరులతో మాట్లాడారు.

‘మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధిక్కరించింది. రిపబ్లిక్ డేకు ఒకరోజు ముందు ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోవడం.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. అరుణాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేతపై నిరసనగా అన్ని రకాలుగా పోరాడుతాం. కోర్టులో ప్రశ్నిస్తాం, పార్లమెంటులో నిలదీస్తాం, ప్రజలతో కలసి పోరాడుతాం’ అని పేర్కొన్నారు. చైనాతో సరిహద్దుగల సున్నితమైన అరుణాచల్‌ను అస్థిరపర్చడం విపత్కర పరిణామాలకు దారితీస్తుందన్నారు. ఈ అంశంపై బీజేపీయేతర పార్టీలతో మాట్లాడుతామని, అరుణాచల్ ఘటన వంటి పరిస్థితుల్లో వారి వెంట నిలుస్తామని పేర్కొన్నారు.

 సుప్రీంలో పిటిషన్.. అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలన చట్టవిరుద్ధమైన, అన్యాయమైన చర్య అని పేర్కొంటూ ఆ రాష్ట్ర సీఎల్పీ చీఫ్ విప్ రాజేశ్ టాచో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా గవర్నర్ ప్రతిపాదన చేశారని అందులో ఆరోపించారు. అసలు రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయానికి కారణమైన ప్రతిపాదనలకు సంబంధించిన రికార్డులను బయటపెట్టాల్సిందిగా కేంద్రాన్ని, గవర్నర్‌ను ఆదేశించాలని కోరారు. గవర్నర్ పక్షపాతంతో వ్యవహరించారని, రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆయన చేసిన ప్రతిపాదన చట్టవిరుద్ధమేగాక, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.

అరుణాచల్‌లో రాజకీయ సంక్షోభానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు విచారణలో ఉన్నాయని.. అలాంటి సమయంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం కోర్టు ధిక్కారమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో నబం టుకి ప్రభుత్వాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... దీనిపై 27న విచారణ చేపడతామంది. కాగా కాంగ్రెస్ అంతర్గత జగడాల కారణంగానే అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిందని.. కానీ ఆ నెపాన్ని మోదీ ప్రభుత్వంపై వేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీ అన్నారు.

Advertisement
Advertisement