‘దేశం భగ్గుమంటోంది’ | Sakshi
Sakshi News home page

 ‘దేశం భగ్గుమంటోంది’

Published Tue, Apr 3 2018 11:54 AM

Attorney General Says Emergency-Like Situation In Country - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టంపై తన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టును కోరింది. దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో అత్యవసర తరహా పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తీర్పుపై పునరాలోచన చేయాలని కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించారు. దళిత సంఘాల ఆందోళనతో దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితి సజావుగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాటి భారత్‌ బంద్‌ సందర్భంగా పలువురు మరణించారని, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని వేణుగోపాల్‌ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే శాంతిభద్రతల పర్యవేక్షణ ప్రభుత్వ బాధ్యత అని అమికస్‌ క్యూరీ అమరేంద్ర శరణ్‌ అటార్నీ జనరల్‌ వాదనతో విభేదించారు.దేశంలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు క్షీణించాయనే పేరుతో సుప్రీం కోర్టు తన ఉత్తర్వులపై స్టే ఇవ్వడం సరికాదని శరణ్‌ వాదించారు.

మరోవైపు ఇదే అంశంపై కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ స్పందిస్తూ దళితుల హక్కులతో పాటు వారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడిఉందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రజ్వరిల్లచేశారని ఆరోపించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని సమూలంగా మార్చాలన్న సుప్రీం కోర్టు తీర్పుతో కేంద్రం విభేదిస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన వివరణ హేతుబద్ధతతో తాము ఏకీభవించబోమని అన్నారు.  

కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దళిత సంఘాల రిట్‌ పిటిషన్‌ను తగిన సమయంలో విచారిస్తామని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. నిజాయితీతో కూడిన ప్రభుత్వ అధికారులను ఎస్‌సీ, ఎస్‌టీ వేధింపుల నిరోధక చట్టం కింద తప్పుడు కేసులు మోపి బ్లాక్ మెయిల్‌కు గురిచేయడాన్ని నిరోధిస్తూ చట్ట నిబంధనలను మార్చాలని మార్చి 20న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. దీనిపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసి బహిరంగ విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరింది.

Advertisement
Advertisement