క్యాబ్ డ్రైవర్లకు తనిఖీ తప్పనిసరి | Sakshi
Sakshi News home page

క్యాబ్ డ్రైవర్లకు తనిఖీ తప్పనిసరి

Published Wed, Dec 10 2014 8:26 AM

క్యాబ్ డ్రైవర్లకు తనిఖీ తప్పనిసరి - Sakshi

పింక్ సిటీలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేసే వారికి ముందస్తు తనిఖీలు తప్పనిసరి చేస్తూ బెంగళూరు పోలీసులు ఉత్తర్వులు జారీచేశారు. పౌరులు.. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ఈ చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఓ ఎంఎన్సీ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని టాక్సీ ఆపరేటర్లందరూ తప్పనిసరిగా తమవద్ద పనిచేసే డ్రైవర్ల నేపథ్యాన్ని తప్పనిసరిగా పరీక్ష చేయించాలని, అవి లేకుండా ఎవరినీ చేర్చుకోడానికి వీల్లేదని బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర రవాణా కమిషనర్ రామెగౌడ సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తమ వద్ద ఉన్న డ్రైవర్ల జాబితా, వారి ప్రొఫైళ్లు, వారి ఇళ్లు ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తాయన్న వివరాలతో ఓ నివేదికను క్యాబ్ ఆపరేటర్లందరూ సమర్పించాలని సీపీ రెడ్డి చెప్పారు. డ్రైవర్ల తాత్కాలిక, శాశ్వత చిరునామాలు, వాళ్ల విద్యార్హత, మొబైల్ నంబర్లు, ఆరోగ్య సర్టిఫికెట్, ప్రవర్తన ధ్రువీకరణ కూడా ఇవ్వాలని తెలిపారు. ఎవరైనా కస్టమర్లు డ్రైవర్ల ప్రవర్తనపై ఆరోపణలు చేస్తే, వెంటనే రవాణాశాఖకు చెప్పాలన్నారు.

Advertisement
Advertisement