ఆ బిర్యానీ ఎంత 'పని' చేయించిందో.. | Sakshi
Sakshi News home page

ఆ బిర్యానీ ఎంత 'పని' చేయించిందో..

Published Thu, Jan 28 2016 10:40 AM

ఆ బిర్యానీ ఎంత 'పని' చేయించిందో..

తిరువనంతపురం: అది కేరళలోని కోజికోడ్. చుట్టూ పచ్చటి వాతావరణం. దానికి 25 కిలో మీటర్ల దూరంలోని ఓ గ్రామ సమీపంలో కొల్లాం చిరా అనే సరస్సు. కాకపోతే అది చెత్త చెదారం పేరుకుపోయి చూడటానికే ఎబ్బెట్టుగా తయారైంది. ఎంతోకాలంగా అక్కడి ప్రజలు ఆ చెత్తను చూస్తూ ముక్కుమూసుకుని వెళ్లిపోయారే తప్ప ఒక్కరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. రాష్ట్రంలోని చెరువు కుంటల్లోని వ్యర్థాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఆ కొల్లాం సరస్సు పరిస్థితి మాత్రం అలాగే ఉండిపోయింది. ఒకప్పుడు చూడటానికి అందంగా కనిపించే ఆ కొలను ఎలా దయనీయంగా మారిపోయిందో అని మనసులో అనుకునే వారేగానీ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.

అయితే, ఉన్నట్లుండి ఈసారి గణతంత్ర వేడుకలకు ఆ కొలనుకు మహర్దశ పట్టింది. దాదాపు పద్నాలుగు ఎకరాల వెడల్పు ఉన్న ఆ చెరువును ఎలాగైనా బాగు చేయించాని ఆ జిల్లా కలెక్టర్ ఎన్ ప్రశాంత్ భూషణ్కు ఆలోచన వచ్చింది. వెంటనే ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అంతేకాదు బిర్యానీ కూడా ఆఫర్ చేశారు. దీనికి భారీ ఎత్తున స్పందన రావడమే కాకుండా దాదాపు నాలుగు గంటలపాటు ఆ చెరువులోకి దిగి చిన్నా, పెద్దా, అధికారి, కూలీ.. అనే వ్యత్యాసం లేకుండా తలా ఓ చేయి వేసి ఆ చెరువుకు పాత కళను  తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో స్వయంగా కలెక్టర్ కూడా తన మేజోళ్లు వదిలేసి చెరువులోకి దిగి పనిచేశారు. ఆ తర్వాత మొదలైంది అసలు సందడి.. అప్పటి వరకు చెరువు కుంటలో దిగి సహాయం చేసిన కలెక్టర్ ఆ వెంటనే గరిటె పట్టి వంటలు చేయడంలో పాల్గొన్నారు. ఘుమఘుమలాడే వంటలు చేయించి స్వయంగా ఆయనే భోజన ప్లేట్లలో వడ్డించారు. అంతేకాకుండా  వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇలా కేవలం పరిపాలన అంశాల్లోనే కాకుండా సామాజిక స్పృహను కలిగి ఉండటమే  ఒక పనికి సంబంధించి ప్రజలను చైతన్యం వంతం చేసి దాన్ని పూర్తి చేయించగలగడంలో ప్రశాంత్కున్న ప్రత్యేక లక్షణం. అంతేకాదు, 'కంపాషనేట్ కోజికోడ్' అనే ప్రత్యేక సంస్థను కూడా స్థాపించి దాని ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


 

Advertisement
Advertisement