ఫిరాయింపుదారులపై అనర్హత వేటు పడాలి | Sakshi
Sakshi News home page

ఫిరాయింపుదారులపై అనర్హత వేటు పడాలి

Published Wed, Apr 27 2016 2:47 AM

ఫిరాయింపుదారులపై అనర్హత వేటు పడాలి - Sakshi

‘సాక్షి’తో బీజేడీ ఎంపీ కలికేశ్ నారాయణ్‌సింగ్ దేవ్
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి ఫిరాయించడం దేశంలోని అనైతిక రాజకీయాలకు నిదర్శనమని బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపి కలికేశ్ నారాయణ్‌సింగ్ దేవ్ చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఏపీ, తెలంగాణలో కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులపై ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. మూడింట రెండొంతుల సభ్యులు ఫిరాయిస్తే తప్ప ఒక పార్టీని వదిలి మరో పార్టీలో చేరడం సాధ్యం కాదని ఫిరాయింపుల నిరోధక చట్టం స్పష్టంగా పేర్కొంటోందని గుర్తుచేశారు. అందువల్ల మూడింట రెండొంతుల పార్టీ సభ్యులు లేని పక్షంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయాలని పేర్కొన్నారు.

దురదృష్టవశాత్తూ ఫిరాయింపులపై స్పీకర్ చేసేదే తుది నిర్ణయంగా పరిగణిస్తారని అన్నారు. అయితే, దీనిపై కోర్టులను ఆశ్రయించడానికి మార్గం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మూడింట రెండొంతుల సభ్యులు లేని పక్షంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా అనర్హత వేటు వేయాలన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి, ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26కు సవరణ చేయడం ద్వారా అసెంబ్లీ స్థానాల పెంపు అంశం వివాదాస్పద సమస్య అని పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాజ్యాంగ నిబంధనలు, అందుకు సంబంధించిన న్యాయపరమైన పరిమితులను దృష్టిలో ఉంచుకోవాలని నారాయణ్‌సింగ్ దేవ్ సూచించారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం అవసరమని చెప్పారు.

Advertisement
Advertisement