చిక్కుల్లో 'చిన్నమ్మ' | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో 'చిన్నమ్మ'

Published Mon, Jun 15 2015 8:30 AM

చిక్కుల్లో 'చిన్నమ్మ' - Sakshi

ఐపీఎల్ నిందితుడు లలిత్ మోడీకి మంత్రి సహకరించారు
బ్రిటన్ నుంచి ట్రావెల్ డాక్యుమెంట్స్ పొందేందుకు తోడ్పడ్డారు
బ్రిటన్ మీడియా వెల్లడి; విపక్షాల రాజీనామా డిమాండ్
మానవతా దృక్పథంతో స్పందించానన్న విదేశాంగ మంత్రి

 
 న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో బెట్టింగ్‌కు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న, వాంటెడ్ జాబితాలో ఉన్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ.. బ్రిటన్ నుంచి ప్రయాణ పత్రాలు(ట్రావెల్ డాక్యుమెంట్స్- టీడీ) పొందేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహకరించారంటూ వచ్చిన వార్తలు ఆదివారం రాజకీయ దుమారం రేపాయి. సుష్మా స్వరాజ్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేయగా.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఆరెస్సెస్‌లు ఆమెకు బాసటగా నిలిచాయి.
 
 బ్రిటిష్ ట్రావెల్ డాక్యుమెంట్స్ పొందేందుకు లలిత్ మోడీకి సాయపడాలంటూ భారతీయ మూలాలున్న బ్రిటన్ ఎంపీ కీత్ వజ్‌ను, బ్రిటన్ హైకమిషనర్ జేమ్స్ బేవన్‌ను సుష్మా కోరారన్న వార్తలున్న ఈమెయిల్స్‌ను బ్రిటిష్ మీడియా బహిర్గతం చేయడంతో ఈ వివాదానికి తెరలేచింది. సుష్మా స్వరాజ్ పేరును ఉపయోగించుకుని, లలిత్ మోడీకి సత్వరమే టీడీ జారీ చేయాలంటూ కీత్ వజ్ బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని బ్రిటిష్ మీడియా పేర్కొంది. దాంతో 24 గంటల్లో మోడీకి అవి అందాయని వెల్లడించింది. సుష్మా స్వరాజ్ దగ్గరి బంధువు జ్యోతిర్మయ్ కౌశల్ బ్రిటన్‌లోని ససెక్స్ యూనివర్సిటీలో లా కోర్సులో చేరేందుకు కూడా కీత్ వాజ్ సహకరించారని పేర్కొంది.
 
 మోడీ భార్యకు కేన్సర్ చికిత్స కోసం..
 ఈ వివాదంపై ట్వీటర్లో సుష్మా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ‘జూలై 2014లో లలిత్ మోడీ నాతో మాట్లాడారు. తన భార్య కేన్సర్‌తో బాధ పడుతున్నారని, ఆగస్ట్ 4న ఆమెకు పోర్చుగల్‌లో ఆపరేషన్ చేస్తున్నారని నాతో చెప్పాడు. హాస్పిటల్ నిబంధనల ప్రకారం భర్తగా సర్జరీ ఆమోద పత్రంపై తాను సంతకాలు చేయాల్సి ఉన్నందున ట్రావెల్ డాక్యుమెంట్స్‌ను బ్రిటన్ జారీ చేయాల్సిన అవసరముందని నాకు వివరించాడు. టీడీ కోసం తానిప్పటికే దరఖాస్తు చేశానని, అవి జారీకి సిద్ధంగా ఉన్న సమయంలో.. ఆ చర్య ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందంటూ నాటి యూపీఏ ప్రభుత్వం నుంచి బ్రిటన్‌కు అందిన సమాచారం అడ్డంకిగా నిలిచిందని మోడీ నాకు వివరించాడు. దాంతో మానవతా దృక్పథంతో స్పందించాను.
 
  ఇలాంటి సందర్భాల్లో భారతీయ పౌరులెవరికైనా బ్రిటన్ ప్రభుత్వం ఈటీడీ జారీ చేయడం ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీయబోదని బ్రిటన్ హై కమిషనర్‌కు స్పష్టం చేశాను. లలిత్ మోడీకి టీడీ జారీ చేయాలనే విషయాన్ని బ్రిటన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించాలని వారికి చెప్పాను. కీత్ వజ్ నాకు ఫోన్ చేసినప్పుడు ఇదే విషయం ఆయనకు కూడా చెప్పాను’ అని సుష్మా స్వరాజ్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీకి కూడా ఆమె వివరణ ఇచ్చారని సమాచారం. జ్యోతిర్మయ్ కౌశల్‌కు 2013లోనే ససెక్స్ యూనివర్సిటీలో లా డిగ్రీలో సాధారణ ప్రక్రియ ద్వారానే అడ్మిషన్ లభించిందని సుష్మా వివరించారు. లలిత్ మోడీ పాస్‌పోర్టును యూపీఏ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టి, ఆ పాస్‌పోర్టును తిరిగి ఇప్పించిన విషయాన్ని కూడా సుష్మా స్వరాజ్ గుర్తు చేశారు. ‘అతని భార్య కేన్సర్ చికిత్సకు అవసరమైన సంతకాలు చేసే అవకాశం కల్పించడమేనా నేను లలిత్ మోడీకి చేసిన మేలు? భార్య ఆపరేషన్ తరువాత  ఆయన మళ్లీ లండన్‌కే వచ్చాడు కదా!’ అని వ్యాఖ్యానించారు.
 
 సుష్మా భర్త మోడీ లాయర్!
 ఐపీఎల్ స్కామ్ బయటపడిన తరువాత, ఆ దర్యాప్తును తప్పించుకునేందుకు 2010 నుంచి లలిత్ మోడీ లండన్‌లో ఉంటున్నారు. ఐపీఎల్ స్కామ్‌కు సంబంధించిన కేసులో లలిత్ మోడీ తరఫున వాదిస్తోంది సుస్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్, వారి కూతురు బన్సురి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
 
 రాజీనామా చేయాలి: విపక్షాలు
 నైతిక బాధ్యత వహించి సుష్మా స్వరాజ్ కేంద్రమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రధాని పాత్రను కూడా ప్రశ్నించిన కాంగ్రెస్.. మోడీలా తప్పుడు పనులు చేసి దేశం వదలి పారిపోయినవారికి ఎందుకు సాయం చేస్తున్నారో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు 11 ప్రశ్నలను ప్రధానికి సంధించింది. దేశంలో కేసులు ఎదుర్కొంటున్న, రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయి ఉన్న వ్యక్తికి సహకరించడం ముమ్మాటికీ తప్పేనని ఆప్ ఆరోపించింది. సీపీఐ, సీపీఎం, జేడీయూ కూడా సుష్మా రాజీనామా చేయాలన్నాయి.
 
 ఎందుకు చేయాలి?: రాజ్‌నాథ్
 సుష్మా స్వరాజ్ తప్పేం చేయలేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఆమెకు మద్దతుగా నిలుస్తుందన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం రాజ్‌నాథ్ పై విధంగా స్పందించడం గమనార్హం. మానవతా కోణంలో సుష్మా స్వరాజ్ స్పందించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. సుష్మా  స్వరాజ్ మానవతావాది అని, ఆ స్ఫూర్తితోనే ఆమె అలా స్పందించారని ఆరెస్సెస్ నేత ఇందరేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement