Sakshi News home page

కాసినోల చుట్టూ ఎన్నికల ప్రచారాలు

Published Sat, Jan 24 2015 5:42 PM

కాసినోల చుట్టూ ఎన్నికల ప్రచారాలు - Sakshi

గోవాలో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ వేటికవే కాసినోల అంశాన్ని కేంద్రంగా చేసుకుని.. ఎన్నికల ప్రచారాలు చేస్తున్నాయి. నగరంలోని తీరప్రాంతాల్లో ఉన్న కాసినోలకు అనుమతులు రద్దు చేయాలని గోవా కాంగ్రెస్ చీఫ్ లీజిన్హో ఫెలీరియో అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వస్తే.. వెంటనే ఈ అనుమతులు రద్దు చేస్తామని చెప్పారు. తీరప్రాంతాల్లో ఉన్న కాసినోలు.. మాండవి నది అందాన్ని చెడగొడుతున్నాయని, వాటిని అక్కడినుంచి తరలించడంలో అధికార బీజేపీ విఫలమైందని ఆయన అన్నారు.

అయితే.. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పార్సేకర్ కాంగ్రెస్ దాడిని తిప్పికొట్టారు. అసలు గోవా తీరప్రాంతంలో కాసినోలకు తొలుత అనుమతినిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు వాటిని తీసేయాలంటే.. కాంగ్రెస్కే దెబ్బ పడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి కాసినోల అనుమతులను రద్దు చేసే అధికారం ఉండదని పార్సేకర్ తెలిపారు. పైగా.. అలా రద్దు చేస్తే, గోవాలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కార్పొరేట్ రంగానికి తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని ఆయన అన్నారు. గోవాలో ప్రస్తుతం మాండవి నదితీరంలో ఐదు కాసినోలు ఉన్నాయి.

పనాజి ఉప ఎన్నిక ఫిబ్రవరి 13న జరగనుంది. మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్రమంత్రిగా వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది.  బీజేపీ నుంచి సిద్దార్థ కన్సోలియెంకర్,  కాంగ్రెస్ నుంచి సురేంద్ర ఫర్టాడో పోటీలో ఉన్నారు.

Advertisement
Advertisement