హ్యాట్రిక్పై బీజేపీ గురి.. ఆశల పల్లకిలో కాంగ్రెస్ | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్పై బీజేపీ గురి.. ఆశల పల్లకిలో కాంగ్రెస్

Published Sat, Nov 23 2013 3:45 PM

BJP eyes third term, Congress also hopeful in Madhya Pradesh

మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టగా, ఈసారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. అతిపెద్ద రాష్ట్రాల్లో ఎంపీ ఒకటి కావడంతో ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని సెమీఫైనల్స్గా భావిస్తున్నాయి.

ఎంపీలోని 230 శాసనసభ స్థానాలకు ఈ నెల 25న ఎన్నికలు జరుగుతాయి. వచ్చే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీనిస్తోంది. శివరాజ్సింగ్ చౌహాన్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే వరుసగా మూడోసారి విజయాన్ని అందిస్తాయని ఆశిస్తోంది. కాంగ్రెస్ మాత్రం సాంప్రదాయ ఓటు బ్యాంక్తో పాటు ప్రజల్లో ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకుని అధికారంలో రావాలని భావిస్తోంది. పనిలోపనిగా బీజేపీ హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తోంది.
 
కాంగ్రెస్, బీజేపీల తరపున అగ్రనాయకులు ప్రచారం చేశారు. బీజేపీ తరపున ప్రధాని  అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. విమర్శలు, ఆరోపణలతో ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా పేరు ప్రచారంలో ఉంది. ఇరు పార్టీల్లోనూ సీనియర్ నేతల వారసులు ఎన్నికల బరిలో ఉన్నారు. చౌహాన్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 143, కాంగ్రెస్ 71 సీట్లు గెలుచుకున్నాయి. బీఎస్పీ ఏడు, భారతీయ జనశక్తి ఐదు స్థానాలు నెగ్గారు. తాజా ఎన్నికల్లో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement