ఢిల్లీ మునిసిపల్‌ పీఠంపై బీజేపీ! | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మునిసిపల్‌ పీఠంపై బీజేపీ!

Published Mon, Apr 24 2017 2:03 AM

ఢిల్లీ మునిసిపల్‌ పీఠంపై బీజేపీ! - Sakshi

► ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడి
► ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు


న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసి, వరుసగా మూడోదఫా అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. ఆదివారం 270 వార్డులకు ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, 53 శాతం పోలింగ్‌ నమోదైంది. అభ్యర్థుల మృతితో రెండు వార్డుల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికలు ముగియగానే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. బీజేపీకి 218, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి 24, కాంగ్రెస్‌కు 22, ఇతరులకు 8 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్‌–సీ ఓటర్‌ సర్వే అంచనా వేసింది. కాషాయ దళానికి ఏకంగా 202 నుంచి 220, ఆప్‌కు 23 నుంచి 35, కాంగ్రెస్‌కు 19 నుంచి 31 సీట్లు రావొచ్చని ఆజ్‌తక్‌–యాక్సిస్‌ మై ఇండియా అంచనా. ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడతాయి.

మందకొడిగా మొదలై.. నార్త్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(103), సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(104), ఈస్ట్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(63).. మొత్తం 270 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌ ఉదయం మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నానికి పుంజుకుంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. లెఫ్టినెంట్‌ జనరల్‌ బైజల్, ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితర ప్రముఖులు ఓటేశారు. కేజ్రీ కుమార్తె హర్షిత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.   ఒపీనియన్‌ పోల్స్‌ ప్రసారం చేసిన టైమ్స్‌ నౌ, ఏబీపీ న్యూస్‌ చానళ్లకు ఢిల్లీ ఎన్నికల కమిషన్‌ నోటీసులిచ్చింది.

Advertisement
Advertisement